mt_logo

విద్యాలయాలు దేవాలయాలతో సమానం : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్‌ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రాంక్యా తండా గ్రామంలోని మండల పరషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.8.91 లక్షలు, ఖమ్మం కార్పోరేషన్ 9వ డివిజన్ రోటరీనగర్ లోని ప్రాధమిక పాఠ‌శాలలో రూ.13.30లక్షలతో 12రకాల మౌళిక వసతుల కొసం ఆయా పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ స‌ద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యాలయాలు దేవాలయాలకు మించునవని, కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ప్రభుత్వ పాఠ‌శాల‌ను తీర్చిదిద్దడమే ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్ మ‌న ఊరు మ‌న బ‌డి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు తెలిపారు. పాఠ‌శాల‌ల్లో ప్రధానంగా 12 మౌలిక వ‌స‌తులను క‌ల్పించి ప్రభుత్వ విద్యకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో గ్రామస్తులు, విద్యా కమిటీలు, పూర్వ విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొని సమిష్టిగా మన పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.సీఎం కేసిఆర్ రూపంలో తెలంగాణ ప్రజలకు ఇది స్వర్ణ యుగం అని, ఏ ఒక్క రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో పరిపూర్ణ మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ఏడాది సంక్షేమంలో 30 వేల కోట్లు ఉంటే.. ఈసారి 90వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఉద్యమ నాయకునిగా కేసిఆర్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి అందరి అవసరాలు తెలుసుకున్నారని, ప్రజలు ఆయనను నమ్మారని, అందుకే ఆయనను ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకులు సీఎం అయితే రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటి ఇపుడు మన కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. అందుకే మొదటిసారి 63 సీట్లతో గెలిపిస్తే…రెండోసారి 25 సీట్లను కలిపి 88 సీట్లతో గెలిపించారు. 7280 వేల కోట్ల రూపాయలను మూడు దఫాలుగా ఖర్చు పెట్టి 26వేల పైచిలుకు పాఠశాలలను అభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమం మన ఊరు మన బడి అని వివరించారు. మన ఊరి మన బడితో నూతన శకం మొదలైందని, తర్వాత కేజీ టు పీజీ విద్య కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పారు. తల్లిదండ్రులు ఎంత పేదరికంలో ఉన్నా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఖర్చు ఎక్కువ అయినా ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారన్నారు. దీనికి కారణం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం.. పాతబడి ఉండడం, వాటిని పట్టించుకోకపోవడం లాంటి చర్యలతో తల్లితండ్రులు వారి పిల్లల్ని ప్రభువైవ పాఠశాలల్లో చదివించేందుకు ముందుకు రావడం లేదన్నారు. కానీ సిఎం కేసిఆర్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని నిర్ణయించారని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కంటే గొప్పగా తీర్చిదిద్దనున్నారని వివారించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో పాఠశాలలను బాగు చేసుకోవడంలో ప్రభుత్వ సాయంతో పాటు పూర్వ విద్యార్థులు, మహిళలు, యువకులు, స్థానిక ధనికులు, గొప్పవారి సహకారం తీసుకోవాలని, బడి బాగు చేసేందుకు అన్ని ప్రయోగాలు చేయాలన్నారు. ఇంగ్లీష్ మీడియం ఈసారి ప్రారంభం అవుతుందని, కొత్తగా మరింత మంది టీచర్లు రాబోతున్నారని, ఉన్న టీచర్లకు శిక్షణ ఇస్తు అందరికీ అర్ధం అయ్యే విధంగా కొత్త పుస్తకాలు ముద్రించి, ల్యాబ్ లు ఏర్పాట్ల చేస్తామన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించామని, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఇంగ్లీషు, తెలుగులో పుస్తకాలను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. ఉపాధ్యాయులకు ఈ వేసవి సెలవుల్లో శిక్షణ ఇస్తున్నామని, అందుకే ఉపాధ్యాయులు తమ మేథస్సుకు పదును పెట్టి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. గతంలో గ్రామాలలో బోర్లు, మోటార్లు కాలిపోయేవని, ఇపుడు ఆ బాధ లేదన్నారు. మన గ్రామాల్లో ఉన్న పాఠశాలలు ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు, గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *