mt_logo

విజయవంతమైన తెరాస సడక్ బంద్

తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను ముట్టడించాయి. వడ్ల కుప్పలు, వరి గొలుసులతో రైతులు తరలివచ్చి కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై కడ్తాల్‌, ఆదిలాబాద్‌ వద్ద, బెంగళూరు జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు వద్ద, విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్‌, చౌటుప్పల్‌ వద్ద, ముంబై జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద రాస్తారోకో చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ ప్రాంతాలతోపాటు అనేక చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ‘వడ్లు కొనాలని పోరాటం- రైతు బతుకుల ఆరాటం, పంజాబ్‌ వడ్లు కొంటరెట్లా.. తెలంగాణ వడ్లు కొనరెట్లా’, బీజేపీ పాలన బలిపీఠం- రైతు బతుకులతో చెలగాటం’, దేశం కోసం ధర్మం కోసం వడ్లు కొనాలి’ అంటూ నినదించారు. రైతులు ఎడ్లబండ్లపై ర్యాలీగా వచ్చి హైవేలను ముట్టడించారు. తెలంగాణ రైతు బతుకుల్లో చీకటి నింపేలా కుట్రలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై గులాబీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూరు వద్ద ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, అబ్రహాం, పట్నం నరేందర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నల్లజెండాలతో నిరసన తెలిపారు. నాగ్‌పూర్‌ జాతీయ రహదారి నిర్మల్‌ జిల్లా కడ్తాల్‌ వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా జందాపూర్‌ వద్ద ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు.

నేడు జిల్లా కేంద్రాల్లో మహా ధర్నా :

ధాన్యం కొనబోమన్న కేంద్రంపై ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికి నియోజకవర్గాలవారీగా బుధవారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లుచేశారు. రైతుబంధు సమితి ఆధ్వర్యంలో కర్షకులను భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జిల్లా సమితిలను ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *