mt_logo

వచ్చే బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించండి : నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ

రాష్ట్రంలో చేపట్టిన మరియు చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రానున్న బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం లేఖ రాశారు.

ఎంఆర్‌టిఎస్‌కు రూ.450 కోట్లు :

కోకాపేట టు నార్సింగి కారిడార్‌లో నిర్మించనున్న మాస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టం (ఎంఆర్‌టిఎస్) ఏర్పాటుకు ప్రాథమిక అంచనాల వ్యయం రూ.3,050 కోట్లు అవుతుందని అందులో భాగంగా ప్రాజెక్టు వ్యయంలో 15శాతం రూ. 450 కోట్లను ముందుగా విడుదల చేయాలని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది 2030 నాటికి దాదాపు 30 కి.మీల పొడవులో నిర్మితమవుతుందని, సుమారుగా 5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన ఆ లేఖలో తెలిపారు.

వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టు :

ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్ ను ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపించినట్టు ఆయన తెలిపారు. ద్వితీయశ్రేణి నగర ప్రజా రవాణాలో ఒక మైలురాయిగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంలో 20శాతం (రూ.184 కోట్లు) మంజూరు చేయాలని ఆయన అభ్యర్థించారు.

సమగ్ర మురుగునీటి మాస్టర్‌ ప్లాన్‌ల కోసం:

హైదరాబాద్‌లో పటిష్టమైన సమగ్ర మురుగునీటి వ్యవస్థను నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ప్లాన్ (సిఎస్‌ఎంపి) గురించి ఆయన ప్రస్తావించారు. ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 62 మురుగునీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు (ఎస్టీపిలు) నిర్మాణం, మురుగునీటి మెయిన్‌ల నిర్మాణం, మురుగునీటిని సేకరించడానికి, ఎస్టీపీల వరకు చేరవేసేందుకు మెయిన్‌ల నిర్మాణం గురించి ఆ లేఖలో మంత్రి తెలిపారు.

లింక్‌రోడ్ల నిర్మాణాలు :

నగరంతో పాటు హైదరాబాద్ అర్భన్ అగ్లోమరేషన్ (హెచ్‌యయుఎ)లో రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం, మోడల్ కారిడార్ల అభివృద్ధి, హైదరాబాద్ రోడ్లు అభివృద్ధి అనేక కార్యక్రమాలను ప్రారంభించామని మంత్రి వివరించారు. మొత్తం 22 మిస్సింగ్ లింక్‌రోడ్లను చేపట్టి పూర్తి చేశామని, మరో 17 లింక్ రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

104 అదనపు కారిడార్‌లకు 2400 కోట్లు :

ఇంకా మిస్సింగ్, లింక్ కనెక్టివిటీ మరింత మెరుగుపడడానికి చుట్టుపక్కల ఉన్న యుఎల్‌బిలతో సహా ఔటర్ రింగ్‌రోడ్డు వరకు విస్తరించడానికి గుర్తించిన 104 అదనపు కారిడార్‌లను 2400 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ లింక్‌రోడ్లు, కనెక్ట్‌వింగ్ కారిడార్‌లు నగర జీవనాన్ని ఎంతో సౌకర్యవంతంగా మారుస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిమిత్తం మొత్తం అంచనా వ్యయం మొత్తంలో మూడింట ఒకవంతు 800 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేయాలని ఆయన కోరారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం :

దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా రోడ్డు నెట్‌వర్క్ నిర్మాణం జరగాలన్న ప్రధాన మంత్రి ఆశయం మేరకు రాష్ట్రంలో ఎస్‌ఆర్‌డిపి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సమగ్ర రవాణా అధ్యయనం ఆధారంగా ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాజెక్టుల ఆవశకతను వివరిస్తూ ఆయా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎస్‌ఆర్‌డిపి ద్వారా పలు ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన తెలిపారు. పలు స్కైవాక్‌లు (100 కి.మీ.లు), ప్రధాన కారిడార్లు (166 కి.మీలు), ప్రధాన రహదారులు (348 కి.మీలు), అధిక ప్రాధాన్యత రహదారుల నిర్మాణాలు (సుమారు 1400 కి.మీలు) గ్రేడ్ సెపరేటర్లు, ప్లైఓవర్లు, మూసీనది వెంబడి తూర్పు, పశ్చిమ కనెక్టివిటీ, మూసీనది వెంబడి కనెక్టివిటీని అందచేసే స్కైవేలు (మూసీనది స్థూపాన్ని పెంచడం ద్వారా, మూసీని ఇరువైపులా 16 కి.మీల) రోడ్ల నిర్మాణ అంచనా వ్యయం రూ.11,500 కోట్లు అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. వాటికి సంబంధించిన వివరాలు :
1. రాజీవ్ రహదారి ఎస్‌హెచ్ 01 (ఆర్‌ఆర్ 14)లో ప్యారడైజ్ జంక్షన్ (జింఖానా గ్రౌండ్ వద్ద) నుంచి శామీర్‌పేట గ్రామం సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం.
2. ప్యారడైజ్ జంక్షన్ నుంచి కండ్లకోయ (వి) సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణం.
ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన భూమి రక్షణమంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, భూసేకరణ ఖర్చు మినహా మొత్తం ప్రాజెక్టు వ్యయం 9000 కోట్లు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే ఎస్‌ఆర్‌డిపి రెండోదశ కోసం డిపిఆర్‌లు 14000ల కోట్లు అంచనా వ్యయంగా పేర్కొన్నాయని తెలిపారు. ముఖ్యమైన రహదారులను మెరుగుపరచడం, వాటి అనుసంధానం కోసం ప్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, ముఖ్యమైన రోడ్ల విస్తరణ వంటివి ఇందులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టులను త్వరితగతిలో పూర్తిచేయడానికి మొత్తం అంచనా వ్యయంలో 10 శాతం సుమారు 3,450 కోట్లను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *