mt_logo

దమ్ముంటే మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయించండి : బండి సంజయ్ కి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్లలో తెలంగాణ నేతన్నలను కేంద్రం పట్టించుకున్నది ఏమీలేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లడం మాని, దమ్ముంటే వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం 897.92 కోట్లు మంజూరు చేయించాలని సవాల్ విసిరారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. లూమ్ అప్ గ్రేడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలని, టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోచంపల్లి కేంద్రంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీని తోపాటు రాష్ట్రంలో కొత్తగా పదకొండు చేనేత క్లస్టర్స్, సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసే బాధ్యత బండి సంజయిదేనన్నారు. ఇది మంజూరు చేయకపోతే రాష్ట్రంలో నేతన్నలను ఏకం చేసి పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కష్ట కాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించామన్నారు. కరోనా వాక్సినేషన్ల ప్రక్రియలో రాజన్న సిరిసిల్లా జిల్లా రాష్ట్రంలోనే ఐదవ స్థానములో ఉందన్నారు. జిల్లాలో 479 వైద్య బృందాలు, 1.5 లక్షల ఇండ్లలో ఫీవర్ సర్వే చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జిల్లా హెల్త్ ప్రొఫైల్ స్కీంకు పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైందని, పిబ్రవరిలో మొదటి వారములో దానికి సంబంధించి పనులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలోని పదమూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మొదటి విడత దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ప్రారంభిస్తామని తెలియజేశారు. మనఊరు మనబడిలో భాగంగా జిల్లాలో ఐదు వందల పది పాఠశాలలను మూడు సంవత్సరాలలో ఆధునీకరిస్తామని మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *