mt_logo

ఇంటింటి ఫీవర్ సర్వే : మంత్రి హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సోమేష్‌కుమార్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఇ రమేష్‌రెడ్డి, టిఎస్‌ఎంఐడిసి చై ర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి హరీష్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ… ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఫీవర్ సర్వేలో వ్యాధిలక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

కరోనా సెకెండ్ వేవ్ సమయంలో ఫీవర్ సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిదని మంత్రి గుర్తు చేశారు. కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, మరికొంతమంది పరీక్షలకు ముందుకు రావడం లేదని తెలిపారు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుందని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్ ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని తెలియజేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల క్రితమే టెస్టింగ్, హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారని, సీఎం సూచనల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని తెలిపారు. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పిహెచ్‌సిలు సహా గ్రామస్థాయి వరకు పంపించామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. జీహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్ల పంపిణీ ఉంటుందని తెలిపారు. కరోనా తగ్గే వరకు ఆదివారం 2 గంటల వరకు అన్ని బస్తీ దవాఖానలు సేవలు అందిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని 27 వేల పడకలనూ ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని, 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు నిర్మించుకున్నామని, దీంతో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోగలిగామని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. లక్షణాలుంటే వెంటనే దగ్గరలోని బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే హోంఐసోలేషన్ కిట్ అందిస్తారని మంత్రి వివరించారు. జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటా పరీక్షలు నిర్వహించి, ముందస్తుగా వ్యాధి లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స మొదలు పెడదామని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉందని, అలా అని నిర్లక్ష్యం చేయొద్దు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు.

31 వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగింపు :

రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల అమలును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈనెలాఖరు వరకు ఆంక్షలు విధించింది. కొవిడ్ కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సర్కారు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *