టీఆర్ఎస్ లోక్ సభ ఎంపీ రంజిత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఇంటిముందే వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేకంగా మొబైల్ క్లినిక్ (ప్రత్యేక బస్)ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ క్లినిక్‌ను ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మొబైల్ క్లినిక్ నియోజకర్గంలోని ప్రతి గ్రామానికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి… అక్కడి ప్రజలకు బీపీ, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలను ఉచితంగా చేయనున్నారు.
కొన్నేండ్లుగా తాను నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో 25 శాతం మంది ప్రజలు బీపీ, మధుమేహం, పలు రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిలో ఈ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఈ మొబైల్ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలు వైద్య పరీక్షలు సులువుగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షల కోసం మొబైల్ క్లినిక్‌ను ఏర్పాటు చేసిన ఎంపీ రంజిత్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చేవెళ్ల ప్రజలకు గొప్ప బహుమతి ఇచ్చావంటూ ప్రశంసించారు. ప్రజలకు చేస్తున్న ఈ సేవాభావం ఇలాగే కొనసాగాలని మంత్రి కేటీఆర్ కోరారు.