mt_logo

న్యూజిలాండ్ లో ఆవిష్కృతమైన ‘రాజన్న సిరిపట్టు’ చీరలు… హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారుచేసిన ప్రత్యేక పట్టుచీరలను న్యూజిలాండ్‌కు చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘రాజన్న సిరిపట్టు’ పేరుతో ఆవిష్కరిచారు. న్యూజిలాండ్ లో జరిగిన ఈ ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కరించబడటం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్న కేటీఆర్… కార్యక్రమ నిర్వాహకురాలు, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఉమ్మడి పాలనలో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు… నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నల నైపుణ్యం వల్ల సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ రాజన్న సిరిపట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణకు వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్ల లోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. అప్పుడే సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకొని, ఆయనతో పట్టుచీరలు తయారు చేయించారన్నారు. వీటిని అమెరికా, యుకె, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లోని తెలిసిన వారికి, సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డర్లు ఇప్పించారన్నారు. అయితే సిరిసిల్ల పట్టుచీరలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిపట్టుగా నామకరణం చేసి న్యూజిలాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌తో పాటు 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *