mt_logo

దేశంలో తొలి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే. తారక రామారావు శంకుస్థాపన చేశారు. దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం కోకాపేట ఇంటర్‌చేంజ్‌ నుంచి నార్సింగి వెళ్లే సర్వీసు రోడ్డులో సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ఐటీ కారిడార్‌ పరిధిలో ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మిస్తామని, దీని ద్వారా సుమారు 16 మెగావాట్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తారని అన్నారు. 2023 వేసవి నాటికి ఈ ట్రాక్ ను అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకున్నదని తెలియజేశారు. నానక్‌రామ్‌ గూడ నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ట్రాక్‌ నిర్మించాలని నిర్ణయించారన్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజోపయోగమైన నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో సైకిల్‌ ట్రాక్‌, దానిపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ను నిర్మిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మెట్రో రైళ్లలోనూ సైకిళ్లను తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తున్నామని గుర్తు చేశారు.

ఆరు నెలల కిందట ఓ మిత్రుడు ఇచ్చిన సూచన మేరకు హెచ్‌ఎండీఏ అధికారులను సౌత్‌ కొరియా, దుబాయ్‌కి పంపించి అధ్యయనం చేయించామని చెప్పారు. 24 గంటలు ఈ ట్రాక్‌ అందుబాటులో ఉంటుందని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సైకిల్‌ ట్రాక్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు మోడల్‌ డెమో కింద 50 మీటర్లు తయారు చేశామన్నారు. జర్మనీ, సౌత్‌కొరియా, ఇతర దేశాలకు దీటుగా 4.5 మీటర్ల వైశాల్యంతో ప్రపంచస్థాయి నిర్మించామని, భవిష్యత్‌లో అంతర్జాతీయ సైక్లింగ్‌ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పలు చోట్ల సైకిళ్లను అద్దెకు ఇచ్చే కేంద్రాలు, మరమ్మతు చేసే వ్యవస్థ, ఫుడ్‌ కోర్టులు, పార్కింగ్‌ వంటి దీనిపై ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌ నగరం ఉత్తర దిక్కుగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ మేరకు ఐటీ కారిడార్‌తోపాటు జంట జలాశయాలు, వికారాబాద్‌లోని అనంతరగిరి కొండలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇందులో భాగంగా గండిపేట చుట్టూ 46 కి.మీమేర సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించి, రిసార్టులు ఏర్పాటు చేస్తామన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి సూచన మేరకు కోట్‌పల్లి చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, తెలంగాణ రెడ్‌కో చైర్మన్‌ వై.సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *