కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని నేడు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, బాపూజీకి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్రం రాక ముందే కాదు.. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో బాపూజీ ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యమంలో తాను పోరాటం చేయడమే కాదు పోరాట యోధులకు సహకారం అందించారని తెలిపారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జలదృశ్యంలోని బాపూజీ ఇంటిని తీసి ఎక్కడైతే బయట పడేశారో అక్కడే తెలంగాణ ప్రభుత్వం 20 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవ్వరూ అడగకుండానే తెలంగాణలో కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేరు పెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ వైతాళికులను గౌరవించుకోవాలనే సంస్కారం ప్రభుత్వానికి ఉందన్నారు. సిరిసిల్లలో కొత్త చెరువు ట్యాంక్ బండ్, కొత్త జంక్షన్‌ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఖర్చులతో మహనీయుల విగ్రహాలు పెట్టుకుందామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
బాపూజీ ఆశీస్సుల వల్లే ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. లక్ష్మణ్ బాపూజీ రుణం తీర్చుకునేందుకే శాశ్వత సమస్యలకు పరిష్కారం చేస్తున్నానని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. దశల వారీగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు.
వరంగల్‌లో 1250 ఎకరాలలో మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం జరుగుతున్నదని, దీని ద్వారా 20 – 30 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందజేశారు. రూ. 70 కోట్ల బడ్జెట్‌ను రూ.1200 కోట్లకు పెంచామని తెలిపారు. కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ తన పాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.