బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా.. లేక కేంద్ర ప్రభుత్వం వైఖరా స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు.. ఇక్కడి గిరిజనుల హక్కు అని సత్యవతి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ మాలోత్ కవితతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడుతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిందని సత్యవతి గుర్తు చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పింది. 100 నుంచి 150 ఏండ్లకు సరిపడా ముడి ఉక్కు నిల్వలు బయ్యారంలో ఉన్నాయని తెలిపారు.
కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణపై పిడుగుపాటు లాంటిందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తీరు చూస్తుంటే.. ఆయన తెలంగాణలోనే జన్మించారా? అన్న సందేహం కలుగుతోందన్నారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక తెలంగాణకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. ఆయన ఉత్సవ విగ్రహంగా మారారు.. కేంద్ర మంత్రి పదవి ఆయనకు అలంకార ప్రాయమే అని విమర్శించారు. కిషన్ రెడ్డి తక్షణమే తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీలో గిరిజన విశ్వ విద్యాలయం పని చేస్తోంది.. కానీ తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం విషయంలో భూమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడుతోందని మండిపడ్డారు.