mt_logo

‘ఇదేనా నారీశక్తి బలోపేతం అంటే..?’ : బిల్కిస్‌ బానో దోషుల విడుదలపై మంత్రి కేటీఆర్ మండిపాటు

బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. దేశ మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌ని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజ‌రాత్ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాల‌ని, ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. రేపిస్టుల‌ను రిలీజ్ చేయరాదు అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నా.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం రేపిస్టుల‌ను రిలీజ్ చేసిన ఘ‌ట‌న వికారంగా ఉంద‌న్నారు. దేశ ప్ర‌జ‌ల ప‌ట్ల స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌ధాని మోదీని కోరారు. ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలను గౌరవించండి.. నారీ శక్తిని సపోర్ట్‌ చేయండి’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని, చిత్తశుద్ధి లేని మాటలెందుకని మండిపడ్డారు.  కాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా నారీశక్తి గొప్పతనంపై ప్రధాని మోదీ మాట్లాడిన గంటల్లోనే బిల్కిస్‌ బానో కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. 2002 గోద్రా ఘటన తర్వాత బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు పలువురు ఘనస్వాగతాలు పలుకడంతో పాటు స్వీట్లు పంచుకోగా… ఇవేనా అమృత మహోత్సవాలు అని ప్రతిపక్షాలు బీజేపీని నిలదీశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *