mt_logo

ప్రధానులు పరిష్కరించని ఫ్లోరైడ్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారు : మునుగోడు ర్యాలీలో మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తానని అన్నారు. మునుగోడును అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచేందుకు మనం అందరం కృషి చేద్దామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్‌కు మునుగోడు క‌ష్టం తెలుస‌ని, 2006లో 32 మండ‌లాలు తిరుగుతూ.. చూడు చూడు న‌ల్ల‌గొండ‌.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాటను స్వయంగా కేసీఆర్ రాశారని గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలో తాగునీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి… ఏ ఒక్క‌రూ కూడా మంచి చేయ‌లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత‌, మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని నాడు శివన్నగూడెంలో నిద్రించిన కేసీఆర్ హామీ ఇచ్చి, దానిని నెర‌వేర్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో న‌ల్ల‌గొండ జిల్లాకు ఆనుకొని కృష్ణా న‌ది వెళ్తున్న‌ప్ప‌టికీ సాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేదని, రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్ట‌లేదని, తాగునీరు ఇవ్వ‌లేదని అన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ ప్ర‌భుత్వంలో చెర్ల‌గూడెం, శివ‌న్న‌గూడెం రిజ‌ర్వాయ‌ర్ క‌ట్టి రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు నీరు ఇవ్వ‌బోతున్నామని, అలాగే ల‌క్ష్మ‌ణ‌ప‌ల్లి రిజ‌ర్వాయర్ పనులను చేప‌ట్టామని తెలియజేశారు. 

10 ఏండ్ల‌కు ముందు మునుగోడు ఎలా ఉండే..? ఇప్పుడు మునుగోడు ఎలా ఉందో? ఆలోచించాలని కేటీఆర్ మునుగోడు ప్రజలను కోరారు. ఒక‌ప్పుడు రాత్రి స‌మ‌యాల్లో బావుల వ‌ద్ద‌కు వెళ్లి మోటార్లు వేసుకునే వాళ్లమని, ఇప్పుడు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఉమ్మ‌డి ఏపీలో విత్త‌నాలు పోలీసు స్టేష‌న్‌లో పెట్టి ఇచ్చేవారని, వాటిలో కూడా అధికంగా క‌ల్తీ విత్త‌నాలే ఉండేవని, కానీ నేడు తెలంగాణ దేశానికే విత్తన కారాగారమైందని వెల్లడించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా రైతుబీమా అమ‌లు చేస్తున్నామని, గుంట భూమి ఉన్న రైతు చ‌నిపోయినా.. వారం రోజుల్లో రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నామని అన్నారు. నేడు రాష్ట్రంలో ల‌క్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుందన్నారు. 

ఎంతో మంది ప్ర‌ధానులు ప‌ట్టించుకోని ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను కేసీఆర్ ప‌రిష్క‌రించారని మంత్రి కేటీఆర్ తెలియజేసారు. 1996లో న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 400 మంది నామినేష‌న్లు వేసి దేశ దృష్టిని ఆక‌ర్షించినా… ప‌రిష్కారం దొర‌క‌లేదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం వ‌చ్చాక ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త విముక్తి క‌ల్పించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *