mt_logo

కోమటిరెడ్డి డబ్బు దాహానికే మునుగోడు ఉపఎన్నిక : మంత్రి కేటీఆర్ ఆగ్రహం

మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ప్రధాని మోడీతో పాటు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటి రెడ్డి డబ్బు దాహానికి జరుగుతున్నదే ఈ ఉపఎన్నిక అని మండిపడ్డారు. చేనేత మీద ప‌న్ను విధించిన మొట్ట‌మొద‌టి ప్ర‌ధాన‌మంత్రి, దుర్మార్గ‌పు ప్ర‌ధాన మంత్రి మోదీ అని ధ్వజమెత్తారు. ఆయ‌న కంటే ముందున్న 14 మంది ప్ర‌ధాన‌మంత్రులు చేయ‌ని దుర్మార్గాన్ని చేసి, చేనేత‌కు మ‌ర‌ణ శాస‌నం రాశారన్నారు. ఈ రోజు చేనేత మీద 5 శాతం జీఎస్టీ విధించాడు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును ర‌ద్దు చేశాడు, నేత‌న్న‌కు ఇచ్చే బీమా ప‌థ‌కాన్ని ఎత్తేశాడు, ఇక  చేనేత బంద్ అయిపోయే రోజును మోదీ తీసుకొస్తాడని కేటీఆర్ మండిపడ్డారు.

‘మునుగోడులో బీజేపీ గెలిస్తే.. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 1000 కోట్లు ఇస్తాన‌ని అమిత్ షా చెప్పిండు అని రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతుండు. ఉప ఎన్నిక వ‌చ్చిన చోట‌ల్లా ఇదే మాట చెబుతారు. ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదు. ప‌చ్చి మోస‌గాళ్లు బీజేపీ నాయ‌కులు. కేవ‌లం ఎన్నిక‌ల్లో గెలిచేందుకే దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దేశం మొత్తం మీద కేసీఆర్ ఒక్కరే చేనేత మిత్ర పేరుతో 40 శాతం స‌బ్సిడీ ఇస్తున్నారు. నేతన్నభీమా ఇస్తున్నారు.  రైత‌న్న‌, గీత‌న్న‌, నేత‌న్న కోసం ప‌ని చేసే నాయ‌కుడిని గెలిపించుకుందాం. సాగునీటి ప్రాజెక్టుల‌కు అడ్డం ప‌డుతున్నారు. కృష్ణా జ‌లాల్లో వాటా తేల్చ‌డం లేదు. 811 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత త‌మ‌కు రావాల్సిన 575 టీఎంసీలు ఇవ్వాల‌ని కోరాం. కానీ స్పంద‌న లేదు. నీళ్ల‌లో వాటా తేల్చ‌కుండా చావ‌గొడుతున్నారు. కేసీఆర్‌కు మంచి పేరు రాకుండా మోదీ ఆగం చేస్తున్నాడు’ అని మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బు మదానికే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందే కానీ, ప్రజల కోసం కాదన్నారు కేటీఆర్. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతీఆయోగ్ 19 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సూచిస్తే ఇప్పటివరకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టి కొనుక్కోడానికి మోదీ ముందుకు వచ్చారని దుయ్యబట్టారు. ఆ కాంట్రాక్ట్ తో వేల కోట్ల రూపాయల లాభం పొంది మునుగోడు ప్రజలను అంగడి సరుకులా అమ్మెందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *