mt_logo

సీఎం కేసీఆర్ ప్రణాళికతో వైద్యరోగ్య సేవలు సామాన్యుని ముంగిట్లోకి : మంత్రి హ‌రీశ్‌రావు

వనపర్తిలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ… ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అలాగే వనపర్తి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగర్ కర్నూలు, గద్వాలలో 200 కోట్లతో నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం కాన్పులు పెరిగాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 407 కోట్లతో 23 ప్రసూతి ఆసుపత్రులు, 30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్సీయూ కేంద్రాలను ఏడేళ్లలో 65కి పెంచామ‌న్నారు. దీనివల్ల శిశుమరణాలు 25 శాతం నుండి 16 శాతానికి తగ్గాయన్నారు. ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాల్లో ఐదు టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ఐదు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వనపర్తి పట్టణాన్ని అన్నిరంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డిని హరీష్ రావు అభినందించారు. అనంతరం వనపర్తిలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల పనులను పర్వవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *