రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సీమ్ అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని తెలియజేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పధానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు.
పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు. ఇది దేశ ప్రజల రాజనీతి దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింతగా పటిష్ట పరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను పొందుపరిచారని అన్నారు. మన దేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయని తెలిపారు. ‘ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ గా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో వెలుగొందుతున్న రాష్ట్రాల హక్కులు మరింతగా సంరక్షించబడడంతోనే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశ దిశలా ఫరిడవిల్లుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
భారత దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం, రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్పూర్తిని ప్రారంభం నుంచీ ప్రదర్శిస్తున్నదన్నారు. రాజకీయాలను, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ రాష్ట్రం నెరపుతున్న రాజ్యాంగబద్దమైన రాజనీతి, నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఫెడరల్ స్పూర్తిని మరింత ధృఢంగా కొనసాగించడానికి కంకణబద్ధులమై ఉందామని, అందుకు అచంచల విశ్వాసంతో ప్రతినబూనుదామని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.