mt_logo

నర్సంపేటలో 250 పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

నర్సంపేటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దాదాపు 60 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రితో పాటు, 1.25 కోట్లతో నిర్మించే టీ.డయాగ్నస్టిక్, 4 కోట్లతో నిర్మించే 26 హెల్త్ సబ్ సెంటర్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ… నర్సంపేట ప్రజలు వైద్యం కోసం వరంగల్ వరకు వెళ్లే పని లేకుండా నర్సంపేటలోనే వైద్యం అందించే మంచి కార్యక్రమం ఇదని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తోన్న టీ. డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని అన్నారు. 26 హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటైన ఘనత కూడా నర్సంపేటకే దక్కుతుందని తెలిపారు. నర్సంపేటకు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మహారాష్ట్ర రైతులు తెలంగాణలో 5 గంటల భూమి కొని ఇక్కడ కరెంట్ తీసుకుని కిలోమీటర్ లైన్ వేసి వ్యవసాయం చేసుకుంటున్నారని, తెలంగాణను ఇంత గొప్పగా అభివృద్ది చేసుకున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ వస్తె మీ బతుకులు చీకటి అవుతాయన్నారని, కానీ నేడు మన బతుకుల్లో సీఎం కేసిఆర్ వెలుగులు నింపారని అన్నారు. బావులు, బోర్ల దగ్గర మీటర్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద 5 ఏళ్లలో 25వేల కోట్ల రూపాయలు ఇస్తాం అంటున్నారని, కేంద్రం చెప్పిన దానికి తల ఊపి డబ్బులు తెచ్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశంలో అద్భుతంగా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కేంద్ర ప్రభుత్వం అది ఓర్వలేకనే మీటర్ల నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రజల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పని రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. 10 లక్షల మందికి 9 వేల కోట్ల రూపాయలతో కళ్యాణ లక్ష్మి కింద పెళ్ళిళ్ళు చేశామని, మహిళలు ప్రసవం కోసం ఇబ్బంది పడొద్దు అని కేసిఆర్ కిట్ తెచ్చారని అన్నారు. తెలంగాణ రాకముందు తాగునీటి కోసం తండ్లాడాము. కానీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల నీళ్ళు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కరోనా లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే చేసి కిట్స్ ఇచ్చారని..మిమ్మల్ని అడుగు బయట పెట్టకుండా కాపాడుకున్న సిబ్బందికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ఎక్కువ సేవ, అభివృద్ధి చేస్తామని తెలిపారు. రేపు దేశంలో మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే.. తెలంగాణ అని చెబితే మీరు గొప్ప వాళ్ళు అనేటట్లు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం యూరియా ధరలు పెంచుతోందని, బీజేపీ నేతలు కాళేశ్వరం 2వ టిఏంసి పనులు ఆపాలని కేంద్రానికి లేఖ రాశారని, అటు కేంద్రానికి ఇటు బీజేపీ నేతలు ప్రజల కోసం చేసేది ఏమీ లేదని, ధరలు పెంచడం తప్ప అన్నారు. బీజేపీకి ప్రజలకి సేవ చేసే ఉద్దేశం లేదని, కేవలం ప్రచార ఆర్భాటమే భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం అన్నారు. బీజేపీ నాయకులను గట్టిగా నిలదీయాలి అని ప్రజలకు మంత్రి పిలుపినిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *