mt_logo

కంటితుడుపు చర్యగా తెలంగాణకు బోగీల సర్వీసింగ్ సెంటర్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా రాష్ట్రానికి రైలు బోగీల సర్వీసింగ్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపింది. రానున్న రెండు నెలల్లో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కోచ్ ఫ్యాక్టరీకి భూమి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన మంత్రి… కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పుకొచ్చారు. అనంతరం ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా… ఒకదానినొకటి ఢీకొనకుండా ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ ‘కవచ్’ పనితీరును, వికారాబాద్ సెక్షన్ లోని గొల్లగూడ చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయోగాత్మకంగా పరిశీలించారు. న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-హౌరా వంటి రద్దీ మార్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 2000 కిలోమీటర్లకు కవచ్‌ రక్షణ వ్యవస్థను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్టు చెప్పారు. రైలు రెడ్‌ సిగ్నల్‌ దాటినా, ఎదురుగా ప్రమాదాన్ని పసిగట్టినా, పట్టాలు బాగాలేకపోయినా, సాంకేతిక లోపం తలెత్తినా కవచ్‌ వెంటనే గుర్తిస్తుంది. మలుపులు, లూపు లైన్లు దాటేటప్పుడు వేగాన్ని నియంత్రిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి-వికారాబాద్‌-సనత్‌నగర్‌, వికారాబాద్‌-బీదర్‌ సెక్షన్ల మధ్య 25 స్టేషన్లను కవర్‌ చేస్తూ 264 కిలోమీటర్ల మేర కవచ్‌ను విస్తరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *