దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పేర్కొన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రోజు రోజుకూ పెరుగుతున్న సెస్‌లతో ‘డివిజబుల్ పూల్’ పూర్తిగా తగ్గిపోతుంది. 1980లో కేంద్రం పన్ను రాబడిలో 2.3 శాతం మాత్రమే ఉన్న సెస్‌లు 2021లో 20 శాతానికి చేరుకున్నాయి. కొన్నిసార్లు ప్రాథమిక ధరలకంటే సెస్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విపరీత పోకడలను హేతుబద్ధీకరిస్తే, రాష్ట్రాలు పన్నుల పంపిణీ ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోగలుగుతాయి.’ అని స్పష్టం చేశారు. కేంద్రం రూపొందించే విధానాల అమలు బాధ్యత రాష్ట్రాలదేనని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. పన్ను పంపిణీ ద్వారా రాష్ట్రాలకు మరింత డబ్బు అందించాలని కేంద్రాన్ని కోరారు.
పన్ను రాయితీల డిమాండ్:
‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు తప్పనిసరిగా అందించాలి. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రెండు విడతలుగా చెల్లించాల్సిన రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రత్యేక గ్రాంట్‌లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫారసులు వెంటనే అమలు చేయాలి..’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
భారీగా పెట్టుబడి రాయితీలివ్వాలి :
‘వస్త్ర పరిశ్రమ, దుస్తులు, బొమ్మలు, తోలు వస్తువులు, లైట్ ఇంజనీరింగ్ వస్తువులు, పాదరక్షలు వంటి రంగాల్లో పెట్టుబడి రాయితీలిస్తే, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు కూడా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. జీడీపీకి 30 శాతం చేయూత ఎంఎస్‌ఎంఈలే ఇస్తున్నాయి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను వీటికి కూడా వర్తింపజేయాలి. చిన్నస్థాయి నుండి మధ్యస్థానికి, మధ్యస్థం నుండి భారీ స్థాయికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందే సంస్థలకు వడ్డీ రాయితీని విస్తరించాలి..’ అని మంత్రి కేటీఆర్ కేంద్రానికి సూచించారు.
కాగితాలపైనే హామీలు :
‘ఆరు పారిశ్రామిక కారిడార్లను పదే పదే అడిగినా మంజూరు చేయలేదు. రక్షణ, ఎలక్ట్రానిక్స్, వస్త్ర, ఫార్మాస్యూటికల్స్ రంగాల ‘ఎకో సిస్టమ్’ తెలంగాణలో ఉన్నందున ఇప్పటికైనా తెలంగాణను పరిగణనలోకి తీసుకోవాలి. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పేపర్లకే పరిమితమయ్యాయి. తెలంగాణకు సముద్రతీరం లేదు. డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశాలివ్వాలి. వచ్చే పదేళ్లలో అత్యధిక ఉద్యోగావకాశాలు సృష్టించనున్న వస్త్ర, ఎలక్ట్రానిక్స్, ఔషధ రంగాలను ప్రోత్సహించాలి. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌ను మూలధన పెట్టుబడిగా వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలి..’ అని ఈ సందర్భంగా కోరారు.