mt_logo

దళితులను అణచివేస్తుంది బిజెపి ప్రభుత్వమే : మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజనుల పేరుతో రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర బిజెపి నేతలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. అగ్రవర్ణాల కొమ్ముకాస్తూ గిరిజన, దళితులను అణచివేస్తూ, వారి రిజర్వేషన్లను కొల్లగొడుతుంది బిజెపి ప్రభుత్వమేనని, అబద్దాలతో గిరిజనులను మోసం చేయలేరని దుయ్యబట్టారు.

బీజేపీ నేతలవి చిల్లర మాటలు :

గిరిజనులకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గిరిజనుల చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడాలని, అవకాశం వచ్చింది కదా అని రాజకీయంగా నాలుగు చిల్లర మాటలు మాట్లాడి పబ్బం గడుపుకునే పనులు చేయొద్దు అని హితవు పలికారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తీర్మాణం చేసి కేంద్రానికి పంపించారని, నిజంగా మీకు గిరిజనులపై ప్రేమ ఉంటే అసెంబ్లీ తీర్మాణం ప్రకారం రిజర్వేషన్లు పెంచి అమల్లోకి తీసుకురావాలని ఛాలెంజ్ విసిరారు.

సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవం కాపాడుతున్నారు:

తెలంగాణలో గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. 75 ఏండ్ల తర్వాత గిరిజన గూడాలకు కరెంట్ లేకపోవడం శోచనీయం అని భావించిన సీఎం కేసీఆర్ గారు వెంటనే 250 కోట్ల రూపాయలతో నిధులు ఇచ్చి 3 ఫెజ్ కరెంట్ ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలు ఇచ్చి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించారన్నారు. మేడారం జాతరకు వరుసగా 2016 , 2018 , 2020 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు కేటాయించుకొని అంగరంగ వైభవంగా సమ్మక్క-సారలమ్మ జాతరలను పెద్ద ఎత్తున జరుపుకోవడానికి నిధులు కేటాయించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పార్లమెంట్లో అనేక సార్లు అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదన్నారు. అది వదిలేసి కేంద్రప్రభుత్వం 2 కోట్లు జాతరకు ఇచ్చింది అని చెప్పుకోవడం మీకు ఏ మాత్రం గౌరవం ఇస్తుంది అంటూ బీజేపీ నేతలను
మంత్రి సత్యవతి నిలదీశారు.

ట్రైబల్ యూనివర్సిటీ అడ్డుకుంది బీజేపీ నేతలే :

రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రతిపాదనలు పంపలేదని, రిజర్వేషన్లు ఇస్తా అని అన్యాయం చేసిందని అని మాట్లాడుతున్నారని, అసలు రిజర్వేషన్లు ఇవ్వాల్సింది కేంద్రం ప్రభుత్వమని, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే దాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది మీరని, ట్రైబల్ యూనివర్సిటీ రాకుండా ఆపింది, గిరిజనుల పండుగలకు నిధులు రాకుండా అడ్డుకున్నది, మేడారం జాతరకు జాతీయ పండుగ గా గుర్తింపు రాకుండా అడ్డుకున్నది మీరని.. పైగా గిరిజనులపై ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తే గిరిజనులు నమ్మరని మంత్రి పేర్కొన్నారు.

గిరిజన భవనాలకు కోట్ల రూపాయల భూములిచ్చింది సీఎం కేసీఆర్ మాత్రమే :

మా తండాలో మా రాజ్యం కావాలని 4016 తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసుకొని గిరిజనలు పాలించుకునే గొప్ప అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. గిరిజనుల బంజారా భవన్, ఆదివాసీల కుమరం భీమ్ ఆత్మ గౌరవ భవనాలు 50 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో వందల కోట్ల రూపాయల విలువైన స్థలంలో నిర్మించింది ఈ తెలంగాణ ప్రభుత్వం అన్నారు. బీజేపీ నేతలే గిరిజనుల హక్కులను సాధించినట్టు, గిరిజనులకు మంచి చేసినట్టు మాట్లాడటం వింతగా ఉందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రతి తండాలో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. మరి దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఎన్ని దేవాలయాలు కట్టించారో చెప్పాలన్నారు. సేవాలాల్ స్వస్థలం మహారాష్ట్రలో అధికారంలో ఉండి కూడా కట్టించలేదు కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గొప్పగా జరుపుతున్నామని తెలియజేసారు.

గిరిజన బిడ్డలు విజ్ఞానవంతులు, వివేకవంతులని, వారికి కావాల్సింది ఏమిటో, వాళ్లకు మంచి చేసింది ఎవరో బాగా తెలుసన్నారు. అనవసరంగా టీఆరెస్ పార్టీని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తే గిరిజనులు మీకు తగిన బుద్ధి చెప్తారని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *