mt_logo

బండి సంజయ్ పై రగులుతున్న అసమ్మతి సెగ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసమ్మతి సెగ రగులుతోంది. సంజయ్‌ ఒంటెత్తు పోకడలపై అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. సీనియర్‌, జూనియర్‌ అన్న తేడా లేకుండా నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం బండి సొంత జిల్లా కరీంనగర్‌లోనూ పలువురు నేతలు రహస్యంగా సమావేశమై, బండికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు సమాచారం. ఎవరినీ లెక్క చేయని బండి తీరుపై పార్టీలోని సీనియర్‌ నేతలు ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం ఓపికపట్టిన నేతలంతా ఇప్పుడు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తూ, అందరూ ఒకే తాటిపైకి వస్తున్నారు. ఎక్కడికక్కడ రహస్య సమావేశాలు నిర్వహించి తమతమ వర్గాలను కూడగడుతున్నారు. కరీంనగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావుతోపాటు మరికొంత మంది నేతలు బండి తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. వరంగల్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతోపాటు మరో సీనియర్‌ నేత రాజేశ్వర్‌రావు, నల్లగొండ నుంచి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తితోపాటు మరికొంత మంది నేతలు పార్టీ అధ్యక్షుడిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మహబూబ్‌నగర్‌లో నాగురావు నామోజీ, హైదరాబాద్‌లో వెంకటరమణి, వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌లో అల్జాపూర్‌ శ్రీనివాస్‌, మల్లారెడ్డి, ఆదిలాబాద్‌లో గోనె శ్యామ్‌ సుందర్‌రావు తదితర నేతలు అసంతృప్తులను ఒక్కదగ్గరకు చేరుస్తున్నట్టు సమాచారం. వీరంతా పార్టీలో ఇమడలేక బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే బీజేపీ సీనియర్‌ నేత, మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్‌ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన దారిలోనే చాలామంది నేతలు నడిచే అవకాశం ఉన్నదని సమాచారం. బండి సంజయ్‌ తీరు మారకుంటే పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని గమనించే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. అయినప్పటికీ అసంతృప్త నేతలు బేఖాతర్‌ చేస్తూ వరుసగా రహస్య సమావేశాలను నిర్వహిస్తుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *