తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావును, టీకా వేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు గవర్నర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే సరైన సమయానికే 2 వ డోస్ కూడా తీసుకోవాలని ప్రజలని కోరారు. టీకా తీసుకొని వారిలోని కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయని, న్యూ ఇయర్ వేడుకల వేళా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నానని, 2022 ఆరోగ్య సంవత్సరంగా సాగాలన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతో పాటు మరో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా మొదటి డోసు వంద శాతం పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కృతజ్ఞతలు తెలిపారు.