mt_logo

సన్నబియ్యం నాణ్యతలో వెనక్కు తగ్గేది లేదు- ఈటెల

జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉల్లిగడ్డల మాదిరిగానే కందిపప్పును ప్రత్యేక కేంద్రాలలో రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులో తెస్తామని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెరుగుతున్న కందిపప్పు ధరలను అదుపులోకి తేవాలని అధికారులకు సూచించారు. పేదలకు అందాల్సిన కందిపప్పును అక్రమంగా పక్కదారి పట్టించేవారిని ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి ఈటెల హెచ్చరించారు.

మానవీయత మరిచి లబ్ధిదారులకు కందిపప్పు, బియ్యం అందకుండా దండుకుంటున్న బ్రోకర్లను విడిచిపెట్టమని, రేషన్ సరుకులను పక్కదారి పట్టించే డీలర్ల డీలర్ షిప్ లతో పాటు రవాణా చేసే కాంట్రాక్టర్ల లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కందిపప్పు బ్లాక్ మార్కెట్ పై నిఘా తీవ్రతరం చేశామని, అక్రమార్కులపై నిఘా కోసం విజిలెన్స్ కమిటీలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సరఫరా చేసే కాంట్రాక్టర్లు తప్ప ఇతరుల వద్ద పప్పు నిల్వలు బయటపడితే సీజ్ చేయడమే కాకుండా చట్టప్రకారం చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు.

విద్యార్ధులకు అందజేసే సన్నబియ్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని, బీపీటీ బియ్యానికి బదులుగా నెల్లూరు సన్నాలు అక్కడక్కడా సరఫరా చేస్తున్నారనే సమాచారం ఉందని, పక్కాగా బీపీటీ బియ్యాన్నే కొనుగోలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అన్ లోడింగ్ పాయింట్ల వద్దే పక్కాగా పరీక్షించుకోవాలని, అవసరమైతే బియ్యాన్ని వండి చూసుకోవాలన్నారు. సన్నబియ్యం పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని, దీనిని అత్యంత జాగ్రత్తగా అమలు చేయాలని ఈటెల వివరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *