mt_logo

ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద మొట్టమొదటి సారిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ఎకో ప్రేండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ TS ఫుడ్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తో కలిసి ప్రారంభించారు. ఈ వాహనంపై ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసే విధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వహకులను మంత్రి అభినందించారు. పర్యావరణ పరిరక్షణ పై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. శుభకార్యములు ప్రారంభించే ముందు గణనాదుడికి పూజలు నిర్వహించడం హిందూ సాంప్రదాయం లో అనాదిగా వస్తున్నదని చెప్పారు. అటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే హైదరాబాద్ లో నిర్వహించే ఉత్సవాలకు ప్రత్యేకత ఉందన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా GHMC పరిధిలో సుమారు 38 వేల వరకు విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఊరేగింపు, నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి GHMC పరిధిలో 6 లక్షల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. నగరంలోని పలు ప్రాంతాలలో బేబీ పాండ్స్ ను కూడా విగ్రహాల నిమజ్జనం కోసం GHMC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తమ ఇండ్ల వద్దనే వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా రూపొందించిన ఈ వాహనాలను అవసరాలను బట్టి వచ్చే సంవత్సరం మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *