సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం మంచి ఫలితాలాన్నిస్తోందని, దళితుల జీవితాల్లో పెద్దఎత్తున మార్పు తీసుకొస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే దళిత బంధు కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. ఈ పథకం దళిత వర్గాలకు మేలుకొలుపు వంటిందన్నారు. బ్యాంకుల నిబంధనలు, తీసుకున్న రుణాలకు తిరిగి కిస్తీలు కట్టే బాధ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఉచితంగా సాయం అందిస్తోందన్నారు. ఇంత అద్భుతమైన పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఈ మేరకు దళితబంధుపై ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనంపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దళితబంధు ద్వారా వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పుపై ఆ కథనంలో చక్కగా విశ్లేషించారని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళితబంధు సత్ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టిందని, దీనిపై మనస్పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ విజన్‌కు ప్రత్యేకంగా ధన్యాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న నిరుపేదలను అభ్యున్నతి వైపు తీసుకెళ్లడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.