తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి విధానాలతోపాటు ఇతర అంశాలపై కే కేశవరావు నేతృత్వంలోని వజ్రోత్సవ కమిటీతో సీఎం సమావేశమవుతారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. ఈ చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరాలు అందజేసింది. ఈ క్రమంలో మంగళవారం నాటి సమావేశంలో వజ్రోత్సవాల కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నారు.