Mission Telangana

నూతన సచివాలయ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణకు నూతనంగా నిర్మితమవుతున్న సచివాలయ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణపు పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరుపై మంత్రి వేములతోపాటు రోడ్లు భవనాలశాఖ అధికారులు, వర్క్‌ ఏజెన్సీ ఇంజినీర్లతో చర్చించారు. కారిడార్లు, గ్రౌండ్‌ ఫ్లోరు, మొదటి అంతస్థుల్లో కలియదిరుగుతూ పరిశీలించారు. తుది దశ నిర్మాణంలో చేపట్టాల్సిన ఎలివేషన్‌ తదితర పనులకు సంబంధించి పలు సూచనలిచ్చారు. సెక్రటేరియట్‌ బాహ్యాలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్‌ టైల్స్‌, గ్రానైట్లు, యూపీవీసీ కిటికీలు, అల్యూమినియం ఫ్యాబ్రికేషన్స్‌, మెట్లకు వేసే గ్రానైట్‌, ఫ్లోరైడ్‌ మార్బుల్స్‌ తదితర నమూనాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు.

పనిచేసేందుకు అనువైన వాతావరణం :

ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉండేలా కార్యాలయాలు, విశాలమైన కారిడార్లు ఉండాలని అభిప్రాయపడ్డ సీఎం కేసీఆర్, తాను సూచించిన మేరకు నిర్మాణం జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఇతర అధికారులను అభినందించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *