mt_logo

ఉద్యోగుల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగుల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా సోమవారం కొత్త జిల్లాలు, జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన విధివిధానాలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీవో 317 విడుదల చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి లోబడి కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజనను చేపట్టనున్నారు. ఉద్యోగుల కేటాయింపు కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల నివేదికల ఆధారంగా ఉద్యోగులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో విభజన, కేటాయింపులు ప్రారంభం కానుండగా, మిగతా జిల్లాల్లో కోడ్‌ ముగిశాక ప్రక్రియను చేపడతారు. పూర్తిస్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని సీఎస్‌ ఆ జీవోలో పేర్కొన్నారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొన్నా .. సీనియార్టీ ప్రకారమే కేటాయింపులు జరుగనున్నాయి.

మార్గదర్శకాలు :

* రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం లోకల్‌ క్యాడర్‌ పోస్టులను ప్రభుత్వం గతంలోనే ఖరారు చేసింది. ఈ ఆదేశాల ప్రకారం అన్ని శాఖల్లో జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టులవారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌ను బట్టి ఉద్యోగులను కేటాయిస్తారు. ఈ క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం అన్ని శాఖల్లో పనిచేస్తున్న వారిని, జోన్లు, మల్టీజోన్‌, జిల్లాల వారీగా మంజూరు చేసిన పోస్టుల ప్రకారం పంపిణీ చేస్తారు. ఇదంతా పారదర్శకంగా, సమతులంగా జరుగనున్నది.
* పాత క్యాడర్‌, సీనియార్టీ ప్రకారం ఉద్యోగుల జాబితాను అన్నిశాఖల విభాగాధిపతులు సిద్ధం చేయాలి. కేటాయింపు సందర్భంగా ఏ ఒక్క ఉద్యోగినీ మినహాయించరాదు. సెలవుపై వెళ్లిన ఉద్యోగితో పాటు, సస్పెన్షన్‌, శిక్షణ, డిప్యుటేషన్‌, ఫారిన్‌ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా, కేటాయించిన జిల్లాలో రిపోర్ట్‌ చేసినట్టుగానే భావించాలి. సెలవులో, సస్పెన్షన్‌లో ఎలా ఉంటే కొత్త క్యాడర్‌లోనూ అలాగే కొనసాగిస్తారు.
* ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారమే, కొత్త లోకల్‌ క్యాడర్‌కు అనుగుణంగా కేటాయింపులుంటాయి.

జిల్లా క్యాడర్‌ పోస్టులు:

* కొత్త జిల్లాల క్యాడర్‌ కోసం కేటాయించిన వర్కింగ్‌ స్ట్రెంత్‌కు లోబడి, పూర్వ జిల్లాల క్యాడర్‌లోని అన్ని పోస్టులకు అవి ఎక్కడున్నా పరిగణనలోకి తీసుకొంటారు.
* ఎనిమిది కొత్త జిల్లాలైన హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు పాత 10 జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ జిల్లాలతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని వారు, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోని పోస్టులతో పాటు, పూర్వపు జిల్లాల్లోని పోస్టులకు సైతం అర్హులు అవుతారు.

జోనల్‌ క్యాడర్‌ పోస్టులు :

*కొత్త జోనల్‌ లేక మల్టీ జోనల్‌ క్యాడర్‌కు కేటాయించిన ఉద్యోగులను పూర్వపు జోనల్‌ క్యాడర్‌గానే పరిగణిస్తారు.
* పూర్వ జోన్‌-5 క్యాడర్‌ ఉద్యోగులను కొత్త జోన్లలో 1 నుంచి 4 వరకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకొంటారు. (అంటే ఈ జోన్‌లోని నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, పాత మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట ప్రాంతంలో వచ్చే పోస్టులను మినహాయిస్తారు) జనగామ జిల్లా జోన్‌ -2లో ఉండగా, ఈ పోస్టులను సైతం పరిగణనలోకి తీసుకొంటారు.
* పూర్వపు జోన్‌-6 క్యాడర్‌ ఉద్యోగులను కొత్త జోన్లు అయిన జోన్‌-5, జోన్‌-6, జోన్‌-7కు పరిగణనలోకి తీసుకొంటారు. జోన్‌-2 పరిధిలోని ఉద్యోగులను జోన్‌ -3 పరిధిలోకి వచ్చే కామారెడ్డి, మెదక్‌ (పూర్వ మెదక్‌ జిల్లా పరిధిలోని సిద్దిపేట కూడా) పరిగణనలోకి తీసుకొంటారు.

మల్టీ జోనల్‌ క్యాడర్‌ పోస్టులు :

* పూర్వ జోన్‌-5 క్యాడర్‌ ఉద్యోగులను మల్టీ జోన్‌-1 (పాత 5వ జోన్‌లోని నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ (పూర్వ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులను మినహాయించి) జనగామ జిల్లాలోని పోస్టులను మల్టీ జోన్‌-2కు కేటాయిస్తారు.
* పూర్వ జోన్‌-6 క్యాడర్‌ ఉద్యోగులను(జనగామ జిల్లాలోని పోస్టులను మినహాయించి) మల్టీ జోన్‌-2, మల్టీ జోన్‌-1కు కేటాయిస్తారు.
* నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, పూర్వపు మెదక్‌ జిల్లాలో భాగంగా మెదక్‌ జిల్లాలోని పోస్టులు పాత జోన్‌-6లో ఉండగా, వాటిని కొత్త మల్టీ జోన్ల ప్రకారం కేటాయిస్తారు.
* ఇంతకుముందు తెలంగాణ మొత్తం ఒకే మల్టీ జోన్‌గా ఉండగా, ఈ మల్టీ జోన్‌ పరిధిలో ఉద్యోగులంతా తాజా రాష్ట్రపతి ఉత్తర్వుల (పీవో-2018) ప్రకారం ఏర్పడ్డ రెండు మల్టీ జోన్లకు కేటాయించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *