హైదరాబాద్ లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారని, ఇట్ల రకరకాలుగా విభజనలో ఉన్నారని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఈ రోజు బంజారాహిల్స్‌లో ఇంత చక్కటి బంజారా భవన్ నిర్మాణం చేసుకోని తన చేతులు మీదుగా ప్రారంభింప జేయడం మంత్రి సత్యవతి రాథోడ్‌కు, బంజారా ప్రజాప్రతినిధులకు, యావత్ తెలంగాణ రాష్ట్ర బంజారా బిడ్డలందరికీ హృదయపూర్వకంగా, సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం అన్నారు. మన రాజధాని నగరంలో బంజారాహిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంటది. కానీ బంజారాలకే గజం జాగ లేదని, దానిని తారుమారు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా భవనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలియజేసారు. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి అని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట పట్టాయని కేసీఆర్ పేర్కొన్నారు.
పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసుకోబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. అడవులు, తండాల్లో ఉన్న మన ఆదివాసీ బిడ్డలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తున్నారని, వారి బతుకులను బాగు చేసేందుకు ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చలు ఈ భవనం నుంచి జరగాలని కోరతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఏదో తమాషాకు పెళ్లిళ్లు చేసుకోవడానికో, ఇంకోటి చేసుకోవడానికో కట్టిన హాల్స్ కాదు. ఇంత మంచి హాల్‌లో చక్కటి సమావేశాలు జరగాలి. ఏ జిల్లాలో, ఏ తాలుకాలో, ఏ తండాలో ఏ సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా రూపుమాపాలి. ఏ విధంగా ప్రభుత్వం సేవలు తీసుకోవాలి. ఇక్కడ ఒక కమిటీలాగా పెట్టి ఎక్కడ ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా ఇక్కడ్నుంచి గద్దల్లా పోయి వారికి రక్షణగా ఉన్నప్పుడే ఈ భవనానికి సార్థకత లభిస్తుంది. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దాదాపు రూ.50 కోట్ల నిధులతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కుమ్రం భీమ్ ఆదివాసీ, సంత్ సేవాలాల్ బంజారా భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్ హాల్స్, వీఐపీ లాంజ్‌లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని గోండు, కోయ, పర్దాన్, థోటి, నాయక్‌పోడ్, చెంచు ఇలా 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి.