రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 7,289 కోట్లను కేటాయించాలని సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దీటుగా నిలబెట్టేందుకుగాను ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలని క్యాబినెట్ తీర్మానించింది. మహిళా యూనివర్సిటీ, అటవీ యూనివర్సిటీలను నెలకొల్పాలని నిర్ణయించింది. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకుగాను గత బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఏటా 2 వేల కోట్లతో రెండేండ్లలో నాలుగువేల కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం అప్పట్లో పేర్కొన్నది. దీని విధివిధానాలపై ఏర్పాటైన సబ్‌కమిటీ.. పలు దఫాలుగా సమావేశమై.. ‘మన ఊరు.. మన బడి’ ముసాయిదా ప్రణాళికను క్యాబినెట్ ముందు ఉంచింది. మొదట్లో నాలుగు వేల కోట్లు అనుకున్న బడ్జెట్ చివరకు 7289 కోట్లకు పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి 40% నిధులను ఈ పథకం కోసమే ఖర్చు చేయనున్నారు. పంచాయితీరాజ్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల నుంచి సైతం నిధులను కేటాయిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు కూడా ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నారు. తెలుగు మీడియంలో చదువుకొనే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతున్నారనే భావన ఉన్నది. ఈ పోటీ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే సుమారు 8 వేల సర్కారు స్కూళ్లల్లో ఇంగ్లీష్‌మీడియం బోధన కొనసాగిస్తోంది. మరికొన్ని పాఠశాలల్లో తెలుగుకు సమాంతరంగా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం విజయవంతంగా నడుస్తున్నది. ప్రతిపాదిత చట్టం రాకతో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. దీనితోపాటు.. ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులను కట్టడి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్కూళ్లల్లో 5%, ఇంటర్‌లో అయితే ఫస్టియర్‌కు 1760, సెకండియర్‌కు 1940 రూపాయలు మాత్రమే ట్యూషన్ ఫీజుగా తీసుకోవాలి. డిగ్రీ కోర్సుల ఫీజులు 20వేల లోపే ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. ఈ దందాకు ఇక అడ్డు కట్ట పడనున్నది. ఫీజుల కట్టడి, ఇంగ్లీష్ మీడియంపై పూర్తి అధ్యయనం చేసి, విధి విధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, జీ జగదీశ్‌రెడ్డి, టీ. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కే. తారకరామారావు సభ్యులుగా ఉండనున్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు.
అటవీ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం :
తెలంగాణలో ‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను అందించగా, వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది.
ఫారెస్ట్ కాలేజ్ విద్యార్థులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు :
సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (ఆనర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్‌ను ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్‌సీఆర్‌ఐలో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) విభాగంలోని ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు, ఫారెస్టర్స్ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997), తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000)లో సవరణలు చేపట్టాలని నిర్ణయించింది.
మహిళా యూనివర్సిటీ
రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కో సం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి మంత్రివర్గ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని క్యాబినెట్ ఆదేశించింది. ఉమ్మడి ఏపీలో తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఉండగా, రాష్ట్ర విభజనతో అది ఏపీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే కోఠి మహిళా కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. తదుపరి ప్రక్రియలన్నీ పూర్తిచేసుకుని యూజీసీ అనుమతులు పొందడంతో కొత్త యూనివర్సిటీ అందుబాటులోకి వస్తుంది.
అదుపులోనే కరోనా :
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంత్రివర్గ సమావేశానికి తెలిపారు. ఇప్పటికే అర్హులైన వారందరికీ మొదటి డోస్ వ్యాక్సిన్ వందశాతం పూర్తయిందని, రెండో డోస్ కూడా పూర్తిచేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ అతి త్వరగా వాక్సినేషన్ చేస్తామని తెలిపారు. బూస్టర్ డోస్‌ను కూడా యుద్ధ పాతిపదికన చేపట్టామన్నారు. ప్రజలు గుమిగూడకుండా ఉంటూ పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని హరీశ్‌రావు చెప్పారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్‌ను త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్యశాఖ మంత్రి, అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు.
కొనుగోళ్లు పూర్తయ్యే వరకు ధాన్యం కేంద్రాలు :
వానకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరుపై క్యాబినెట్ చర్చించింది. ఇప్పటికే కొనుగోలు పూర్తి కావొచ్చింది. అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాలకు వస్తూనే ఉన్నది. దీనిని దృష్ణిలో పెట్టుకొని ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంతవరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.
నేడు పరకాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటన :
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు మంగళవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో జరిగిన పంట నష్టంపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.