mt_logo

తెలంగాణకు కేంద్రం మొండిచేయి… జాతీయ చేనేత సాంకేతిక సంస్థ లేనట్టే

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని తెలంగాణలో హాండ్లూమ్‌ టెక్నాలజీ శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత ప్రధానికి ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం తెలంగాణలో ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయడం కుదరదని గురువారం ఓ లేఖ ద్వారా సమాధానం ఇచ్చింది. ఇప్పటికే ఒడిస్సా ఐఐహెచ్‌టీలో తెలంగాణకు 9 సీట్లు కేటాయించామని, ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరి శిక్షణా సంస్థలో కూడా కోటా ఉన్నందున తెలంగాణలో ఐఐహెచ్‌టీలో ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన వెంకన్న నేత… చేనేత రంగానికి కొత్త తరం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సాంకేతికతతో కూడిన శిక్షణ ద్వారా భవిష్యత్‌లో చేనేత రంగం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలంగాణలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుపై కేంద్రం మరోసారి ఆలోచించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మెగా పవర్ లూం క్లస్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూం టెక్నాలజీ, బ్లాక్‌లెవల్ క్లస్టర్‌లను మంజూరు చేయించుకోవాలని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. దుబ్బాక, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, సిద్దిపేట, ఆర్మూర్, మహదేవ్‌పూర్, కొత్తపేట తదితర చేనేత ప్రాంతాల్లో ఏ ఒక్కచోటయినా ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ హ్యాండ్‌లూం టెక్నాలజీ కేంద్రాన్ని మంజూరు చేయాలని గతంలోనే కోరింది. అయితే తాజాగా కేంద్ర చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు వెలువరించిన ప్రకటనలో తెలంగాణ సహా దేశం లో కొత్తగా ఏ రాష్ట్రంలోనూ జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్‌టీ) ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణకు ఇప్పట్లో ఐఐహెచ్‌టి వచ్చేట్లు లేదని స్పష్టమవుతున్నది. 40 వేలకు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తెలంగాణకు ఇది తీరని కోరికగానే మిగిలిపోయింది. అలాగే వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కుకు ‘పిఎం మిత్ర’ లో వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరినా స్పందన లేదు. అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణపేట తదితర ప్రాంతాల్లో బ్లాక్ లెవెల్ క్లస్టర్లలో అక్కడి చేనేత కళాకారులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ చేనేతను కేంద్రం ప్రభుత్వం అసలు పట్టించుకోవడమే లేదు అనడానికి ఈ చర్యలే నిదర్శనం. ఇక జీఎస్టీని 12 శాతానికి పెంచడం చేనేత, జౌళి రంగంలోని చిన్న పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి దక్షిణాది రాష్ట్రాలు చేనేతరంగం అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సాయం అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ జీఎస్టీ దుష్పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన శూన్యం. అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ ఉన్న మన చేనేత ఉత్పత్తులకు రక్షణ, నేతన్నలకు అండగా నిలబడవలసి ఉంది. సృజనాత్మక కళానైపుణ్యం, దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిన చేనేత రంగంపై దృష్టి సారించి, అభివృద్ధికీ అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు జీరో జీఎస్టీ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేనేతకారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *