mt_logo

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్.. బధిర క్రీడాకారిణికి 15 లక్షల ఆర్థిక సహాయం

బధిర చెస్ ఛాంపియన్ కు సహాయం చేస్తానన్న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బ‌ధిర చెస్ ప్లేయ‌ర్ మ‌లికా హండాకు 15 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించిన కేటీఆర్, భవిష్యత్తులో పోటీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌ను కూడా బహుమతిగా అందజేశారు. మ‌లికాకు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. తమకు సహాయంగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు మ‌లికాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

పంజాబ్‌కు మ‌లికా హండా.. బధిర చెస్‌ ప్లేయర్‌. కెరీర్‌లో ఇప్పటి వరకు ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సహా నాలుగు రజతాలు సాధించింది. జాతీయ బధిర చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఏడుసార్లు గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి విజయాలు కైవసం చేసుకుంది. తన సొంత రాష్ట్రం పంజాబ్‌ నుంచి ఆమెకు సరైన ప్రోత్సాహం అందని కారణంగా, విసిగివేసారిన మలికా..తన ఆక్రోశాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లగక్కింది. బధిర ప్లేయర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు తమ పాలసీలో లేవన్న ఆ రాష్ట్ర క్రీడా మంత్రి పర్గత్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకొని తన కోపాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. మలికాకు సంబంధించి వివరాలు అందిస్తే వ్యక్తిగతంగా వీలైనంత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మంత్రి కార్యాలయ సిబ్బంది మలికా కుటుంబ సభ్యులను వెంటనే సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో నేడు మలికా తన కుటుంబ సభ్యులతో సహా మంత్రి కేటీఆర్ ను కలుసుకోగా.. మలికాకు 15 లక్షల ఆర్థిక సహాయంతోపాటు, ఓ లాప్టాప్ ను బహుమతిగా అందించారు మంత్రి కేటీఆర్. ఎక్కడో పంజాబ్ లో ఉన్న ఓ బధిర క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన మంత్రి కేటీఆర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *