తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు బుధవారం లేఖ రాశారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచిన విధంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని లేఖలో వివరించారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను సవరించాలని కూడా అమిత్ షాను కోరారు. అయితే రాజ్యసభలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం నాడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ అసెంబ్లీ సీట్ల పెంపుకి రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది కాబట్టి అది కుదరదని, 2026 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ సీట్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని బదులివ్వడంతో… దీనికి కౌంటర్ గా వినోద్ కుమార్ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కారణాలపై బుధవారం రాజ్యసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినోద్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.