mt_logo

15 రోజుల పాటు భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు : ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు

తెలంగాణ ప్రభుత్వం భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతోంది. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ ఎంపీ కే కేశవరావు ఆధ్వర్యంలో బుధవారం బీఆర్కేభవన్‌లో తొలి సమావేశం జరిపి తీసుకొన్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. వజ్రోత్సవ వేడుకలను ఆగస్టు 8న హైటెక్స్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తుండగా… ముగింపు ఉత్సవాలు 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో పోలీస్‌ బ్యాండ్‌, ఇతర కళారూపాల ప్రదర్శన ఉంటుందని, అలాగే హైదరాబాద్‌ నగరం మొత్తం అలంకరిస్తామని, స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలను, హోర్డింగులను ప్రదర్శిస్తామని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న జాతీయ నేతల చరిత్రను తెలిపేలా 15 రోజుల పాటు ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని, పాఠశాలలు, సినిమాహాళ్లలో ఈ చిత్రాలను ప్రదర్శిస్తామని వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమంపై అవగాహన కలిగించేలా స్కూళ్లలో వ్యాసరచన, పాటల పోటీలు, నాటక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకు ఆటల పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో అథారిటీగా కలెక్టర్‌, రాష్ట్ర స్థాయిలో అథారిటీగా తమ కమిటీ ఉంటుందని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని చెప్పారు. దీపాంజలి కార్యక్రమం, అంబేద్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు భారీ జాతీయ జెండా ర్యాలీ, ట్రాఫిక్‌ సిగ్నళ్లలో జనగణమన ఆలాపన ఉంటాయని కేకే తెలిపారు. ఏ రోజు, ఏ కార్యక్రమం చేయాలనేది మరో సమావేశంలో నిర్ణయిస్తామని వివరించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ముగింపు ఉత్సవాలకు ప్రతి జిల్లా నుంచి వెయ్యి నుంచి 2 వేల మందిని తీసుకొచ్చి ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *