నరేంద్రమోదీ ప్రభుత్వంపై పోరాటంలో తొలి అడుగుగా సీఎం కేసీఆర్ ఆదివారం చేపట్టిన ముంబై పర్యటన జాతీయ రాజకీయాల్లో సంచలనమైంది. ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి పనిచేయలేరన్న అపవాదును తుడిచేస్తూ కేసీఆర్ తన తొలి పర్యటనలోనే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీని తనతో కలిసి కేంద్రంపై పోరాటానికి ఒప్పించారు. దేశ భవిష్యత్తు, బీజేపీ సర్కారు వైఫల్యాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ముగ్గురు నేతలు మోదీ సర్కారుపై యుద్ధం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నెలకొల్పుతామని శపథం చేశారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఆహ్వానంతో ఆదివారం ముంబయి వెళ్లిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ నేతలతో సమావేశ అనంతరం మీడియాతో మాట్లడుతూ… దేశ పురోగమన దిశను సరైన మార్గంలోకి మళ్లించేందుకు కలిసివచ్చే అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలతో చర్చలు జరుపుతామని, త్వరలో హైదరాబాద్ లేదా మరో ప్రాంతంలో సమావేశం ఏర్పాటుచేసి భావసారూప్యంగల నేతలందరితో చర్చిస్తామన్నారు. మహారాష్ట్ర నుంచి ఏ పని ప్రారంభించినా కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని, ఛత్రపతి శివాజీ, బాల్ ఠాక్రే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఉద్ధవ్ ఠాక్రేతో జరిపిన భేటీ పరిణామాలు అతి త్వరలోనే కనిపిస్తాయని అన్న సీఎం కేసీఆర్, ఇకపై కొత్త ఉత్సాహంతో కేంద్రంపై యుద్ధం చేస్తామని, దేశ ప్రజల కోసం పోరాడుతామన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ… దేశానికి కొత్త దిశ చూపించేలా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని, ఈ దిశగా ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాల స్థాయి దిగజారిపోయిందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ఎవరో ఒకరు నడుం బిగించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే మేమిద్దరం ముందుకొచ్చామని, మా ప్రయాణం కఠినమైనదే అయినా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు.
దేశం అన్నిరంగాల్లో పరివర్తన చెందాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. దేశ రాజకీయ, ఆర్థిక రంగాల్లో మార్పు తీసుకొచ్చేందుకు జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో జరిపిన చర్చలతో ఆ దిశగా తొలి అడుగు పడిందని పేర్కొన్నారు. ముంబై పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ రాజకీయాలు, అభివృద్ధి తీరు, 75 ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు తాను ముంబై వచ్చానని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రేను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నదని, ఆయనతో అనేక అంశాలపై చర్చించానని చెప్పారు. ‘దేశాభివృద్ధి వేగం ఎలా పెరగాలి, మంచి పరిపాలన ఎలా ఉండాలి, దేశంలో నిర్మాణాత్మక మార్పుల కోసం పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయాలనే అంశాలపై చర్చించాం. దాదాపు అన్ని అంశాల్లో మేమిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం. కలిసి పనిచేయాలని నిర్ణయించాం’ అని వెల్లడించారు. దేశంలోని సుహృద్భావ వాతావరణాన్ని, సంస్కృతిని చెడగొట్టకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించామని చెప్పారు. అందరం కలిసి పనిచేస్తే శక్తిమంతమైన భారతదేశం ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రతో తెలంగాణది సోదర బంధమని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాలు దాదాపు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్నాయని, కాబట్టి ఏ అంశమైనా ఇద్దరం కలిసి పరస్పర సహకారంతో పనిచేయాల్సి వస్తున్నదని చెప్పారు. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టే ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మారిందని, రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిందని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రాజెక్టుల్లో సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మహారాష్ట్ర నుంచి తాను వెలకట్టలేని ప్రేమాభిమానాలను తీసుకెళ్తున్నానని తెలిపారు. సమయం చూసుకొని హైదరాబాద్‌కు రావాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల తరఫున ఆహ్వానించారు. దేశానికి కొత్త దిశ చూపించేలా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయనున్నట్టు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ దిశగా ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాల స్థాయి దిగజారిపోయిందని, ఇలాగే కొనసాగితే దేశం భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఎవరో ఒకరు నడుం బిగించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తామిద్దరం ముందుకొచ్చామని చెప్పారు. తమ ప్రయాణం కఠినమైనదని, ఎంత కష్టమైనా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మంచి అనుబంధం ఉన్నదని గుర్తుచేశారు. దేశంలో విధానపరమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఇదే సఖ్యతతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ప్రతీకార రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని, హిందూత్వం కూడా ఎప్పుడూ ప్రతీకారం కోరదని స్పష్టంచేశారు.