mt_logo

హైదరాబాద్ విడిచి వెళ్లొద్దు : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితులకు హైకోర్ట్ ఆర్డర్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు ప్రధాన నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో కీలక వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డితో నిందితులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంప్రదింపులు జరపరాదని కోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను శనివారం చేపడుతామని పేర్కొన్నారు. 

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో పోలీసులకు పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్‌ చేశారు. రాష్ట్రం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉన్నదని కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై నేర పూరిత కుట్రకు పాల్పడ్డారని కోర్టుకు తెలియజేశారు. ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్‌కు ఉత్తర్వులు ఇవ్వకపోవడం తీవ్ర తప్పిదమని, చట్ట నిబంధనలకు తిలోదకాలివ్వడమేనని అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు. 2014లో అర్నేశ్‌కుమార్‌ వర్సెస్‌ బీహార్‌ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలను ఇక్కడ పాటించలేదన్నారు. చట్టసభ సభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం తీవ్ర నేరమనే విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ విషయాలన్నీ రిమాండ్‌ రిపోర్టులో స్పష్టంగా ఉన్నప్పటికీ ఏసీబీ కోర్టు పట్టించుకోలేదని వివరించారు. అన్ని కేసుల్లో నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ముగ్గురి వెనుక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉన్నదని, వీరిని రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. ప్రలోభాలకు సంబంధించి ఆడియో సాక్ష్యా ధారాలు ఉన్నాయని, లోతుగా దర్యాప్తు జరిపితే తెరవెనుక సూత్రధారులు బయటకు వస్తారని చెప్పారు. 

 కాగా కెమెరాలన్నింటినీ ముందుగానే ఏర్పాటు చేశారా ? అని ఈ సమయంలో న్యాయమూర్తి ప్రశ్నించగా, చేశామని ఏజీ బదులిచ్చారు. ప్రతివాదులు హైదరాబాద్‌లోనే ఉంటారని, సమగ్ర వాదనలకు గడువు కావాలని వారి తరఫు న్యాయవాది కోరడంతో విచారణ శనివారానికి వాయిదా పడింది.

ముమ్మాటికీ కుట్రే : 

ఫామ్‌హౌస్‌లో నాలుగు చోట్ల రహస్య కెమెరాలు ఏర్పాటు చేశామని, రోహిత్‌రెడ్డి జేబులో రెండు వాయిస్‌ రికార్డర్లు ఉన్నాయని హైకోర్టు వేసిన ప్రశ్నకు ఏజీ సమాధానమిచ్చారు. నిందితుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రతిపాదన రోహిత్‌రెడ్డికి వచ్చిందని, దీంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపారు. పార్టీ మారితే ఈడీ, సీబీఐ కేసులు ఉండబోవని నిందితులు భరోసా ఇచ్చారని, నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని చెప్పారు. బేరసారాలు జరిపేందుకు నిందితులు వస్తారని ముందే రోహిత్‌రెడ్డికి తెలియడంతో ఆధారాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఏజీ కోర్టుకు వివరించారు.

కీలక విషయాల్ని వదిలేసిన ఏసీబీ కోర్టు :

‘దర్యాప్తు అధికారికి సీఆర్పీసీలోని 41(1)(బీ) సెక్షన్‌ ప్రకారం అధికారం ఉన్నదనే విషయాన్ని ఏసీబీ కోర్టు విస్మరించింది. కేసు దర్యాప్తులోని అత్యంత కీలక విషయాలను పట్టించుకోకుండా 41ఏ నోటీసు ఇవ్వలేదనే సాకుతో తిరసరించారు. సత్యేంద్రకుమార్‌ అంతిల్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో కూడా సుప్రీంకోర్టు దీన్ని స్పష్టం చేసింది. రెండో నిందితుడైన నందకుమార్‌ నేర స్వభావం ఉన్న వ్యక్తి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రిమాండ్‌కు పంపకపోతే మరో నేరానికి పాల్పడుతాడన్న దర్యాప్తు అధికారి వాదనను కింది కోర్టు పట్టించుకోకపోవడం చెల్లదు. అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే కాకుండా ఇతర చట్టాలన్నింటినీ దర్యాప్తు అధికారి అమలు చేశారు. ఈ విషయాలన్నింటినీ ఏసీబీ కోర్టుకు చెప్పినప్పటికీ వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించారు. ఏడేండ్లలోపు శిక్షపడే కేసుల్లోని నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాలనడం తప్పనిసరికాదు. 41(బీ)లోని కీలక విషయాలను కింది కోర్టు పట్టించుకోలేదు. ముగ్గురు నిందితులు ఏసీబీ కోర్టులో లొంగిపోయేలా ఉత్తర్వులు ఇవ్వాలి. ఆ ముగ్గురినీ రిమాండ్‌కు తరలించేలా ఏసీబీ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌లో పేరొన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *