mt_logo

వంద బిలియన్ల పెట్టుబడులు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కేటీఆర్

ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తెలంగాణను చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహిస్తున్న బయో ఏషియా 19వ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్‌ గురువారం వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ గణనీయ పురోగతిని సాధిస్తోందని, ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు ద్వారానే ఇది సాధ్యపడిందని వెల్లడించారు. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. రానున్న దశాబ్ద కాలంలో 100 బిలియన్ల పెట్టుబడులు సాధించి, తద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నదని చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో మొత్తంగా 215 కంపెనీల ఏర్పాటు ద్వారా 6400 కోట్ల పెట్టుబడులు సాధించడంలో తెలంగాణ విజయవంతమైందని చెప్పారు. నిరుడు ఒక్క సంవత్సరంలోనే 34 వేల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 200 శాతానికి మించిందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా బయో ఏషియా సదస్సు అర్థవంతమైన చర్చల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైఫ్‌సైన్స్‌ అభివృద్ధికి కృషిచేస్తున్నదన్నారు. ఫైజర్‌, మొడెర్నా టీకాల అభివృద్ధికి సంబంధించి ఆర్‌ఎన్‌ఏపై కృషిచేసి ప్రతిష్ఠాత్మక జినోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకొన్న డాక్టర్‌ డ్రూ వైస్‌మాన్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. లైఫ్‌ సైన్సెస్‌ అభివృద్ధి ఆవశ్యకతను కొవిడ్‌ మహమ్మారి గుర్తుచేసిందన్నారు. ‘ఫ్యూచర్‌ రెడీ’ థీమ్‌తో బయోఏషియా సదస్సును నిర్వహించడం సందర్భోచితంగా ఉన్నదని చెప్పారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ తన ప్రత్యేకతను, ఉనికిని చాటుకొంటూనే ఉన్నదని కేటీఆర్‌ తెలిపారు. పెద్దలకు అందించే కొవిడ్‌ టీకాలలో మూడింటికిగాను రెండు.. కొవాక్జిన్‌, కార్బెవాక్స్‌, అలాగే చిన్నపిల్లలకు ఇచ్చే రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో తయారు కావడం తమకు గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *