ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వప్నమైన సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా పైన ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ చెప్పారు. రామచంద్రు తేజావత్ ను జర్మనీ బృందం మంగళవారం ఢిల్లీలో కలిసింది. తెలంగాణలో పర్యటించే అవకాశం కల్పించాలని జర్మనీ బృందం ఆయనను ఈ సందర్భంగా కోరింది. జర్మనీ బృందంతో భేటీ ముగిసిన తర్వాత రామచంద్రు తేజావత్ మీడియాతో మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, విత్తన కంపెనీలు తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాయని, రాష్ట్రంలో వాతావరణం, భూ పరిస్థితులపై పరిశోధన చేసి మేలిరకం విత్తనాల ఉత్పత్తి కోసం కృషి చేస్తామని జర్మనీ బృందం చెప్పినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో మూడురోజులపాటు జరిగే నేషనల్ సీడ్స్ సదస్సుకు జర్మనీ బృందాన్ని ఆహ్వానించామని రామచంద్రు తెలిపారు.