mt_logo

మహిళా, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుంది- కేటీఆర్

మహిళలు, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుందని పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు తెలిపారు. గ్రామజ్యోతిలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని రామన్నపల్లిలో మంత్రి కె.తారక రామారావు పర్యటించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మహిళలు, గ్రామాల్లోని యువకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని మహిళాసంఘాల ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపైన మహిళలు ఉద్యమస్ఫూర్తితో కదలాలన్నారు.

  • పారిశుద్ధ్యంపై మహిళాసంఘాలు పట్టుదలతో ముందుకు కదలాలని పిలుపు
  • గ్రామాల్లో 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మహిళలతో సాధ్యమన్న మంత్రి
  • నిరక్ష్యరాస్యులకి చదువు చెప్పే బాధ్యత యువకులు తీసుకోవాలి
  • గ్రామజ్యోతితో తమకు తామే పాలించుకుంటున్నామన్న భావన ప్రజలకి కలుగుతుందన్న మంత్రి

గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా తాను దత్తత తీసుకున్న రామన్నపల్లిలో ఒకరోజుపాటు గ్రామంలో గడిపిన మంత్రి.. గ్రామంలో కాలినడకన పర్యటించారు. గ్రామస్తులతో కలిసి గ్రామమంతా కలియతిరిగిన మంత్రి ఎక్కడి సమస్యలకి అక్కడే గ్రామస్తులు సూచించిన పరిష్కారాలపై అధికారులకి అదేశాలిచ్చారు. మురికికాల్వల పరిశుభ్రతతోపాటు, వీధుల్లో పారిశుద్ధ్యానికి ఉపయోగపడే ట్రై సైకిళ్ళను కార్మికులకి అందజేశారు. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్తులను కోరిన మంత్రి.. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేని 60 కుటుంబాలు మరుగుదొడ్లు కట్టుకోవాలని కోరారు. ఇందుకు గ్రామంలోని మహిళా సంఘాలు ముందుకు రావాలన్నారు. దీనికి స్పందించిన మహిళా సంఘాల సభ్యులు గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని, 15 రోజుల్లో పూర్తి చేస్తామని స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆమేరకు ప్రమాణం చేశారు. ముందుగా మహిళా సంఘాల్లోని మరుగుదొడ్లు లేని సభ్యుల ఇళ్లలో నిర్మాణాలు ప్రారంభించాలని, ఆ తర్వాత గ్రామాల్లోని వార్డులను దత్తత తీసుకుని 100 శాతం మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు అవసరమైన నిధులను స్వచ్చ భారత్ అభియాన్ మరియు ఉపాధిహామీ పథకం ద్వారా సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల రూపురేఖలు మార్చాలంటే యువశక్తి కీలకమని, యువకులు ఈ దిశగా ముందుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాల్లో చదువుకున్న ప్రతి యువకుడు ఒక నిరక్ష్యరాస్యునికి చదువు నేర్పించే బాధ్యత తీసుకుంటే వందశాతం అక్ష్యరాస్యత సాధ్యమౌతుందన్నారు. ఇందుకోసం గ్రామాల్లోని చదువుకున్న యువకులతోపాటు తొమ్మిదవ తరగతిలోపల ఉన్న యువకులు బ్యాచులగా ఏర్పడి, రామన్నపల్లిలోని నిరక్ష్యరాస్యులకి చదువుచెప్పాలని నిర్ణయించారు. గ్రామాల్లోని యువజన సంఘాలు ఈ మేరకు ముందుకురావాలని కోరారు.

గ్రామజ్యోతి ద్వారా గ్రామపంచాయితీల్లో అనేకవిధాలుగా మార్పు వస్తుందని తెలిపిన మంత్రి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వాల మాదిరే గ్రామస్థాయిలో స్థానిక ప్రభుత్వాలు పనిచేయాలని, ఇందులో ప్రజల భాగసామ్యం పెరిగేలా చేస్తే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామజ్యోతితో ప్రజలు తమ పాలనలో తాముసైతం భాగస్వాములమన్న భావన పెరుగుతందని తెలిపారు. తమ అవసరాలను తామే నిర్ణయించుకునే అధికారం ప్రజలకి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *