మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటు అందించాడనికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిసున్న ఇంక్యుబేటర్ విమెన్-హబ్ విజయవంతం అవుతోంది. ఇప్పటికి రెండు బ్యా బేలో స్టార్టప్ కంపెనీలను ఇంక్యుబేట్ చేసి, మూడో బ్యాచ్ లో సహకారం కావాల్సిన కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ఇటీవలే వాటి ఎంపిక కూడా పూర్తి చేసింది. ఈ మూడో బ్యాచ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కు సంబంధించి 26 స్టార్టప్ ను ఎంపిక చేసినట్లు వి-హబ్ తాజాగా ప్రకటించింది. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో 2018లో ఏర్పడిన వి-హబ్ ఇంక్యుబేట్ చేసిన కంపెనీలు వాణిజ్య పరంగా ఊహించని విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా వి-హబ్ లోనే పుట్టి పెరిగిన హైదరాబాద్ కు చెందిన వైద్య పరికరాలు తయారు చేసే కంపెనీ స్టార్టూన్ ల్యాబ్స్ రూపొందించిన ఫీజ్ అనే పరికరం కార్పొరేట్ ఆస్పత్రుల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ కు చెందిన శాంతాబయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ ఆర్థో డాక్టర్, సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ గురువారెడ్డిల సమక్షంలో ఫిజ్ పరికరాన్ని లాంచ్ చేశారు. ఫిజియోథెరపీ అసెస్మెంట్ డివైజ్ గా పేరొందిన ఈ పరికరం ఆర్థో లేదా న్యూరో సమస్యల బారిన పడ్డ వారు చికిత్స తర్వాత ఫిజియోథెరపీ తీసుకుంటున్న సమయంలో ఎంత వరకు కోలుకుంటున్నరాన్న దానిపై క్లినికల్ రిపోర్ట్స్ ను తయారు చేస్తుంది. దీంతో పేషెంట్ రికవరీ ఎలా ఉందన్న విషయం తెలుసుకోవడం చికిత్స అందించిన డాక్టర్లకు సులువవుతుందని స్టార్టూన్ వ్యవస్థాపకురాలు మైత్రేయి కొండపి చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఫీజ్ అనే పరికరాన్ని కిమ్స్, అపోలో లాంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వినియోగిస్తున్నారని, ఇక్కడ ఈ పరికరం విజయవంతంగా పనిచేస్తుండడంతో దీని తయారీకి స్టార్టూన్ ల్యాబ్స్ కు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలంటే అప్పడాలు, పచ్చళ్లు తయారు చేసేవాళ్లన్న ముద్ర ఉండేదని, ఫీజ్ అనే వైద్య పరికరాన్ని తయారు చేసి మైత్రేయి దాన్ని చెరిపివేసిందని వి-హబ్ సీఈవో దీప్తి రావుల అన్నారు. స్టార్టూన్ ల్యాబ్స్ తో కేవలం కొత్త రకమైన పరికరం అందుబాటులోకి రావడమే కాక, దానిని పెద్ద ఎత్తున తయారు చేయడానికి స్థానిక, ఇతర ప్రాంతాల్లోని చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు విడిభాగాల సరఫరాకు అవకాశం లభిస్తుందని దీప్తి పేర్కొన్నారు.
అన్ని వ్యాపారులకు సహాయం :
మహిళా వ్యాపారవేత్తలు, వారు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న వి-హబ్ కేవలం టెక్నాలజీ కంపెనీలకే కాకుండా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించే కంపెనీలకు ఊతంగా నిలుస్తోంది. స్టార్టప్ లను ఇంక్యుబేట్ చేయడంతోపాటు వాటి వృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం టీ- ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి ద్వారా వి-హబ్ ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీల వృద్ధికి అవసరమైన పెట్టుబడి సాయం చేసినట్లు వి-హబ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. వి-హబ్ సహకారం తీసుకోవడానికి భారీ సంఖ్యలో మహిళా స్టార్టప్ లు ఆసక్తి చూపుతుండడంతో ప్రతి బ్యాచ్ లో ఇంక్యుబేషన్ కోసం కంపెనీల నుంచి దరఖాస్తులు తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇటీవల మూడో బ్యాచ్ ఇంక్యుబేషన్ కోసం పెద్ద ఎత్తున కంపెనీలు దరఖాస్తు చేయడమే వి-హబ్ విజయానికి నిదర్శనమని నిర్వాహకులు పేర్కొంటున్నారు.