mt_logo

పేచీకోరు బాబు – పనిజోరు కేసీఆర్

By: మయూఖ

‘అన్నదమ్ములుగా విడిపోదాం… ఆత్మీయులుగా కలిసుందాం’ అన్న ఉదాత్త నినాదంతో సాగింది తెలంగాణ ఉద్యమం. 60 ఏళ్ళ దుఃఖాన్ని పంటిబిగువున భరిస్తూ ఆంధ్ర సోదరులతో సఖ్యతనే కోరుకుంది తెలంగాణ సమాజం. ఉద్యమ విజేత కేసీఆర్ ప్రభుత్వ అధినేతగా రూపాంతరం చెందటానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజమైన దార్శనికుడిగా, ప్రజా బంధువుగా ఆయన ఎన్నికలలో విజయం తర్వాత మాట్లాడారు. ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని తెలంగాణలో అడ్డుకుని, చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక కూటమిని మట్టికరిపించినా కేంద్రంలో, ఆంధ్ర ప్రదేశ్లో విజయం సాధించిన వారికి హుందాగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గకుండానే తెలుగువారి ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంతో సమిష్టిగా పనిచేస్తామని ఆయన ప్రకటించారు.

సాటి తెలుగు రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇట్లా వుంటే ఆంధ్రా బాబులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తమ అక్కసును బహిరంగంగానే కక్కుతున్నారు. నమ్మినబంటు, ‘లాడ్డుబాబు’గా తన ‘ఇమేజ్ మేకోవర్’ చేసే బాధ్యత భుజాన వేసుకున్న ‘జర్నలిస్టు తేజం’ ఆర్కేతో ఎన్నికలలో గెలిచిన గంటల వ్యవధిలోనే తన ‘హార్టును ఓపెన్’ చేసేశారు బాబు గారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేసీఆర్కి శుభాకాంక్షలు చెప్పకపోగా ‘తను నా దగ్గరే పెరిగాడు … నా దగ్గరే ఇదయ్యాడు… అతనిది నా దగ్గర పనిచేసిన చరిత్ర… ‘ అంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఆర్కే గారి అదనపు ఉప్పు సరే సరి. ఇది కేసీఆర్కు తనకు ఉన్న రాజకీయ వైరం కారణంగా, తెలంగాణలో తమ పార్టీ కొస ప్రాణంతోనైనా కొనసాగేటట్టు చేయడం కోసం అనుకొని ఆత్మ వంచన చేసుకోవచ్చు. కాని తెలంగాణ జిల్లాల్లో ఎందుకు పార్టీ గెలవలేక పోయింది అని అడిగితే అక్కడి ప్రజలు విజ్ఞత కోల్పాయారంటూ మరో అహంకారపూరిత వ్యాఖ్య చేశారు. పోనీ ఆయన విజ్ఞత అంతే అని వదిలేసినా తరువాత ఆయన మాటలు మాత్రం ఏమాత్రం క్షమార్హం కావు. ఎందుకంటే అందులో రాజకీయ కుట్ర ఆనవాళ్ళు స్పష్టంగా బయటపడ్డాయి. 2019లో తామే తెలంగాణలో అధికారంలోకి వస్తామంటే అత్యాశకి కొత్త నిర్వచనంగా కొట్టివేయొచ్చు కానీ, అంత కన్నా ముందే రావచ్చు అంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలదోస్తామని బహిరంగంగా సవాలు చేయడమే. ఇది టీఆరెస్ ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చిన మొట్ట మొదటి బొకే!

పోనీ అదికూడా టీఅరెస్ పార్టీ వారికి సంబంధించిన విషయం అని వదిలేస్తే వదిలేయ వచ్చు. ‘రెండు ప్రాంతాల్లో ఉన్న ఏకైక పార్టీ మాదే… రెండు పక్కల తెలుగువారిని కలపగల సత్తా మాకే ఉంది’ అంటూ బాబు హుంకరించడాన్ని ఏ రకంగానూ తెలంగాణ సహించకూడదు. అక్కడితో ఆగకుండా ఓ ఉచిత సేవా పథకాన్ని కూడా బాబు గారు ప్రకటించారు. అదేమిటంటే తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడే దాకా తిష్ట వేసి ఇక్కడి ప్రజల బాగోగుల్ని కూడా వారు చూస్తారట. తెలంగాణ ప్రజల ప్రతినిధిత్వం వహిస్తున్న ఒక ప్రభుత్వం ఉండగా ఆ బాధ్యతను తను తీసుకుంటాను అని అనడం ఆ ప్రభుత్వాన్ని, ప్రజల్ని పరిహసించడమే.

ఇంత అహంకార, దురుద్దేశ్య పూరిత వ్యాఖ్యలు చేసిన బాబు గారు చివరికి ప్రజల్ని రెచ్చగొట్టవద్దంటూ కేసీఆర్కు ఓ ఉచిత సలహా ఇచ్చి ముగించారు. ‘ఇప్పటి వరకు నీ ఆటలు సాగాయి… రెచ్చగొడితే వదిలిపెట్టం… ఎక్కడికి పోతారో మీరే చూస్తారుగా…’ అంటూ మరింత రెచ్చగొట్టారు. ‘వార్ రూమ్’ కాదు… ‘పీస్ రూమ్’, ‘డెవలప్మెంట్ రూమ్’, రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన ‘సయోధ్య రూమ్’ కావాలంటూ హితవు పలికారు. అత్యధిక కాలం ముఖ్య మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తికి వార్ రూమ్ అంటే తెలియదనుకోలేము. అయినా ఆ మాటలు అన్నారంటే అది యాదృచ్చికం మాత్రం కాదు.

వాళ్ళే గిల్లి, మళ్ళీ వాళ్ళే లొల్లి చేయడం ఒక వ్యూహంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ఆర్డినెన్సు విషయంలో టీడీపీ మళ్ళీ తెలంగాణను రెచ్చగొట్టింది. రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడనున్న విషయాన్ని విస్మరించి డిల్లీలో తమ ‘కొత్త మిత్రుల’, ‘పాత శ్రేయోభిలాషుల’ సహకారంతో రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్సును కేంద్ర ప్రభుత్వం తెచ్చేలా వత్తిడి తెచ్చింది. పారదర్శకంగా పరిపలిస్తామన్న ‘నమో’ వాగ్దానం మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే నీటి బుడగ అయ్యింది. తమ మొట్ట మొదటి మీడియా సమావేశంలోనే దేశ న్యాయ శాఖా మంత్రే స్వయంగా అబద్దం ఆడవలసి వచ్చింది. దీనికి టీడీపీ వత్తిడి కారణం కావచ్చు. అధికారం ఉంది కదా అని చట్ట, రాజ్యాంగ వ్యతిరేక, సంప్రదాయ విరుద్ధ నిర్ణయాలు తీసుకోవడం ఖచ్చితంగా రెచ్చగొట్టడమే.

రైతు రుణ మాఫీ విషయంలో టీడీపీ అనుసరించిన వైఖరి కూడా ఇలాగే ఉంది. తెలంగాణా మంత్రివర్గం కనీసం తొలి సమావేశం కూడా జరగకముందే రుణ మాఫీపై అనవసర రాద్ధాంతం చేసింది ఆ పార్టీ. బ్యాంకర్లతో సమాచారం సేకరించే పనిలో ఉండగానే జరగరానిదేదో జరిగిపోతుందని అమాయక రైతులను ఆందోళనకు, గందరగోళానికి గురి చేసింది. అదే చంద్రబాబు రుణ మాఫీపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే మాత్రం సడీ, చప్పుడు లేదు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటామన్న చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనేమో!

ఇప్పుడేమో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం – 2014, రెండు రాష్ట్రాల డిమాండును పరిగణనలోకి తీసుకొని విద్యుత్ కేటాయింపులు చేసింది. ఆ ప్రకారం చూసినా తెలంగాణా విద్యుత్ లోటును ఎదుర్కోనుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో పరిస్థితి మరింత దిగజారనుంది. తెలంగాణా సుమారు 600 మెగా వాట్ల విద్యుత్ కోల్పోవలసి వస్తుంది. తెలంగాణలో గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు, అదనపు విద్యుత్ తప్పనిసరి. కొత్త రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించి పారిశ్రామిక రంగంలో నైరాశ్యం నింపడం ఒక లక్ష్యం. ఫలితంగా వాటిని అదనపు విద్యుత్ ఉన్న సీమాంధ్ర వైపు తిప్పుకోవడం, విస్తరణ ఆలోచనలతో ఉన్న సంస్థలకు ఒక భయాన్ని కల్పించడం మరొక లక్ష్యం. మరోవైపు సామాన్య జనాల, ముఖ్యంగా రైతులనుండి నిరసనను ప్రేరేపించడం తద్వారా తెలంగాణా ప్రభుత్వం సమర్థతపై అనుమానాలు రేకెత్తించడం ప్రధాన లక్ష్యం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని తెలివిగా కృష్ణా డెల్టా నీటి విడుదలకు లింకు పెట్టి మరింత రెచ్చగొడుతుంది. నిజానికి రెండు వేరు వేరు అంశాలే అయినా రెండింట్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దుష్ప్రచార ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటికి 10 టీఎంసీల నీటిని కోరితే 2 టీఎంసీల నీరు సరిపోతుందని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసింది. నాగార్జున సాగర్లో నీటి మట్టం 517 అడుగులు ఉండగా కేవలం 13 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలంగాణా ప్రభుత్వం వివరించింది. అయినా దీన్ని రాజకీయం చేసి ఆంధ్ర ప్రాంత రైతాంగం దృష్టిలో తెలంగాణా ప్రభుత్వం ఒక విలన్ అని చూపే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు శాసనమండలి సీపీఐ పక్షనేత స్థానికతను ప్రశ్నించడం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణా యాస మాట్లాడుతున్నారంటూ అడ్డుతగలడం కూడా ఈ పరంపరలో భాగమే. ఏపీ సభలో ఉండి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నవంటూ నిలదీశారు. ఇంతకీ చంద్రశేఖర్ చేసిన తప్పేమిటంటే తెలంగాణాపై వ్యతిరేకతతో నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రభుత్వానికి హితవు చెప్పడం. తెలంగాణలో శాసనసభ నడుపుకుంటూ అక్కడి యాసని కించపరచడం రెచ్చగొట్టడం కాక మరేమిటి?

ఇక టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం మనకు. తెలంగాణ ప్రాంత ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులని మీడియా స్వేచ్చ మాటున అత్యంత జుగుప్సాకరమైన రీతిలో అవమానించి ప్రజా ఆగ్రహాన్నిచవిచూసాయి ఈ చానెళ్ళు. ఆత్మగౌరవంతో ఎంఎస్వోలు ఆ చానళ్ళ ప్రసారం ఆపితే అప్పుడూ ఎదురుదాడినే ఎన్నుకున్నాయి. నిజానికి తెలంగాణా ప్రభుత్వం ఆ చానెళ్ళపై చర్య తీసుకునే అంశాన్ని సభాపతులకు వదిలేసాయి. వారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయినా ప్రభుత్వం తమను కక్షపూరితంగా టార్గెట్ చేస్తుందనే వితండవాదం చేస్తున్నాయి. పనిలో పనిగా టీడీపీ, బీజేపీ గొంతు కలిపినాయి. పాపం ఆ పార్టీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీన్యూస్, వ్6 న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలపై నిషేధం గురించి తెలియదనుకోవాలా? నిజానికి అక్కడ కూడా ప్రభుత్వపరంగా ఆ చానెళ్ళపై బాన్ లేదు. కేవలం ఎంఎస్వోలే ప్రజల వత్తిడి మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు.

ఇవన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విభజన తర్వాత ఆంధ్ర ప్రాంత నాయకులు తీవ్ర నిరాశకి, నిస్పృహకి గురయ్యి ఉన్నారు. తెలంగాణా ప్రభుత్వం ‘విమాన’ స్పీడుతో ‘టాటా’ చెప్పుకుంటూ నింగికి దూసుకెల్తుంటే నిర్హేతుక విమర్శలు చేస్తున్నారు. ఆ రకంగా వారి ఈర్ష్యను వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు రెండు కారణాలు కనపడుతున్నాయి. పద్నాలుగు సంవత్సరాలుగా ఆంధ్ర ఆధిపత్య శక్తులు సంయుక్తంగా తెలంగాణ పట్ల స్థూలంగా, కేసీఆర్, ఆయన పార్టీ పై ప్రత్యేకంగా చేసిన విపరీత దుష్ప్రచారం గడచిన మూడు వారాల ప్రభుత్వ పనితీరుతో మబ్బుల రీతిన చెదిరిపోవడం. ‘ఉద్యమమంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉండడం అంటే జవాబు చెప్పడం… చంద్రశేఖర రావుకు ఉద్యమాలు చేయడం వస్తుంది కాని ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు’ అన్న తమ స్వీయ సూత్రీకరణలు బద్దలవటం. రెండవది, ముఖ్యమైనది. అభివృద్ధి అంటే మాకే సాధ్యం, మాకు మాత్రమే సాధ్యం అని గొప్పలకు పోయిన టీడీపీ, ఆయన వంది మాగధుల స్వోత్కర్షలు నీటి బుడగలుగా పగిలిపోవటం. జాతీయ, అంతర్జాతీయ ప్రచార సాధనాలు తెలంగాణ ప్రభుత్వ పనితీరును, ప్రత్యేక ముద్రను ప్రముఖంగా ప్రచురిస్తున్ననేపథ్యంలో ఆంధ్ర ఐటీ పితామహుడు, నాదెళ్ళ సత్య ‘ప్రేరకుడి’ మాటల్లో నిజాయితీ ఎంతో, డంబాచారం ఎంతో ప్రజలకు నెమ్మదిగా తెలిసిరావడం. హైదరాబాదు ఒక స్వయం ప్రేరిత, స్వయం చోదిత అభివృద్ధి కేంద్రం అని ఇప్పుడు ప్రజలకు మరింత స్పష్టమవడం. హైదరాబాదు అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాత్రా ఉంది. నాలుగు వందల చరిత్ర ఉన్న ఒక మహానగర అభివృద్ధి ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి ‘మంత్రందండం’ ద్వారా జరిగిందంటేనే అభ్యంతరం. ఎవరి పాత్ర ఎంత అన్న దగ్గరే భిన్నాభిప్రాయాలు.

ఇటువంటి దాడులు భవిష్యత్తులో మరింత తీవ్రంగా, మరింత ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటన, ఇరాక్ సంక్షోభం, రుణ మాఫీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా స్పందించింది. పనిచేయడం మాత్రమే కాదు చేస్తున్నట్టు కనిపించాలన్న నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో పని చేయడం కంటే, చేస్తున్న పనిని చేస్తున్నట్టు చూపడానికే ఎక్కువ సమయం, డబ్బు ఖర్చు చేశారు. తెలంగాణకు అది ఆదర్శం కాకపోవడం మంచిదే కానీ, మరీ ఆత్మరక్షణ కూడా తగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *