mt_logo

పునరేకీకరణ

ఒక రాజకీయ ఉద్యమం వల్ల సిద్ధించిన తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ కూడా జరగడం ఇవ్వాళ్టి ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం స్వీయ రాజకీయ అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమం. తెలంగాణ ఏర్పడింది. ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌కు అధికారం దాఖలయింది. పదమూడు సంవత్సరాలు స్వీయ రాజకీయ అస్థిత్వం కోసం సకల ఉద్యమశ్రేణులను కలుపుకొని కేసీఆర్ సుదీర్ఘ ఉద్యమం నడిపారు. తెలంగాణకు ఏకైక నాయకుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ నాయకత్వంపైన నమ్మకం పెరిగింది. తెలంగాణ తేవడానికి మృత్యుముఖం దాకా వెళ్లివచ్చిన కేసీఆరే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయగలడన్న విశ్వాసమూ పెరిగింది. అందువల్లనే తెలంగాణ కోరుకున్న, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసిన రాజకీయశక్తులు కేసీఆర్ నాయకత్వం క్రిందకు రావడం ఒక ముందంజ. నిజానికి ఇప్పుడు ఏ ఎన్నికలూ లేవు. టికెట్ల గొడవా లేదు.

పదవుల గొడవ అసలే లేదు. గెలుపు ఓటముల బాధా లేదు. అయినప్పటికీ రాజకీయ కప్పలతక్కెడ అనివార్యతలు లేనప్పటికీ బుధవారం నాడు టీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున జరిగిన చేరికలు చిల్లర రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని ధృవపరుస్తున్నాయి. కాంగ్రెస్‌లో నిరాదరణకు గురై బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన ఇద్దరు శాసనసభ్యులు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాజలింగంలు, తెలుగు దేశం పార్టీ నుంచి బోడకుంటి వెంకటేశ్వర్లు, సలీం, టీచర్ ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్ధన్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని స్వార్థంతో చేసిన పనిగా చెప్పలేము. ఆమోస్ తొలి తెలంగాణ వీరయోధుడు. ఆయన చేరికను అర్థం చేసుకుంటే చాలు ఇవెంత సానుకూలమైన చేరికలో తెలుస్తుంది. తెలంగాణ సమాజం ఇప్పుడు బంగారు తెలంగాణ కోరుకుంటున్నది. పునర్నిర్మాణాన్ని ఆశిస్తున్నది.

ఉద్యమ సమయంలో వెల్లడైన ఆకాంక్షలు సఫలం కావాలని కోరుకుంటున్నది. కోటి ఆశలతో సుదీర్ఘ పోరాటం నడిపి, త్యాగాల సాలు పోసి నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు. వచ్చిన తెలంగాణను నిర్మించే శక్తి, పటిమ, సామర్థ్యం ఎవరికున్నదో వారికే ప్రజలు పట్టం కట్టారు. కేసీఆర్‌కే ఆ భవిష్యత్ విజన్ ఉన్నదని భావించినందునే స్పష్టమైన మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. ఒక స్పష్టమైన ప్రణాళిక, భవిష్యత్ దర్శనంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదనే విషయం స్వల్పకాలంలోనే అవగాహనకు వచ్చింది. ఒకవేపు సీమాంధ్ర పెత్తనం ఏర్పరిచిన ఆధిపత్యాన్ని బద్దలుకొట్టడం, మరోవేపు విభజన సందర్భంగా రూపొందించిన అసంబద్ధ విధానాలను ఒక్కటొక్కటిగా ఎదిరించి నిలవడం, మరోవేపు కక్షపూరితంగా, కుట్ర పూరితంగా, కొంచెపుతనం ప్రదర్శిస్తూ శత్రువులా వ్యవహరిస్తున్న చంద్రబాబు కుట్రలను బట్టబయలు చేసి నిలబడడం లాంటివి ప్రభుత్వం ఎజెండాగా ఉన్నది.

ఇవన్నీ రాజకీయ అంశాలు. కానీ ప్రభుత్వపరంగా ప్రజలకు ఆకాంక్షలను తీర్చడానికి, ఒక్కటొక్కటిగా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను క్రమబద్ధంగా కార్యాచరణ రూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వంలో తీవ్ర కసరత్తు జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల తరబడి ఒక్కొక్క శాఖ, ఒక్కొక్క అంశంపై సమీక్షా సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా సుహ్రుద్భావం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి అప్పుడే మనమందరం కలిసి తెలంగాణను నిర్మించుకుందామని ప్రతిపక్ష పార్టీలను సమ్మిళితం చేసుకుని మాట్లాడారు. ఈ పరిణామాలన్నింటి వల్లా ఆయా రాజకీయ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వరద ప్రారంభమయింది. స్వీయ రాజకీయ అస్థిత్వం పాదుకొని బలపడాలంటే ఇది అనివార్యం. రాజకీయశక్తుల పునరేకీకరణ జరగాలి.

నవజాత శిశువు తెలంగాణ. ఈ శిశువుపై ఆంధ్రులు తీవ్ర కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినందువల్ల, ఆయన స్వభావమే కుట్రపూరితమైంది కనుక, హైదరాబాద్‌లోని సెట్లర్ల ఓట్లతో రంగారెడ్డిని కలుపుకొని కొన్ని స్థానాలు గెలుపొంది అనేక సవాళ్లు విసురుతున్నాడు. 2019లో అధికారంలోకి వస్తానని బీరాలుపోతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూపోతే, చంద్రబాబు మాత్రం రాజకీయ సవాళ్లు విసురుతున్నాడు.

కేంద్రంలో తన కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై ఒక్క ఆర్డినెన్స్‌తో తెలంగాణ భూభాగాన్ని మింగినప్పటి నుంచి, పీపీఏలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నాగార్జున సాగర్ నీళ్ల దాకా వివాదాలు సృష్టిస్తున్నాడు. చంద్రబాబుకు వత్తాసు పలికి, తెలంగాణ ప్రయోజనాలను వ్యతిరేకించి, ఆంధ్ర రోటి పాట పాడే మీడియా, ఇప్పటికే తన నగ్న స్వభావాన్ని చాటుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు తెలంగాణ నిర్మించుకోవాలంటే ఉద్యమ సమయంలో జరిగిన ఏకీకరణ, ఐక్యత రాజకీయ రూపంలో జరగవలసి ఉన్నది. బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరికలను కూడా ఆ దృష్టితోనే చూడాలి.

తెలంగాణ సబ్బండ వర్ణాలు, సకల జనులు, అనేక ఉద్యమ సంస్థలు, టీఆర్‌ఎస్ నాయకత్వంలో ఏకమై తెలంగాణ సాధించుకున్నట్టుగానే, ఇప్పుడిక రాజకీయపార్టీలన్నీ కూడా ఒకే అస్థిత్వం క్రిందకు చేరి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఐక్యత ప్రదర్శించవలసి ఉన్నది. ఒకవేళ ఒకే రాజకీయ ఛత్రం కిందకు రాకున్నా కేసీఆర్ చేతులను బలోపేతం చేయవలసి ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలకు బహిరంగంగా అడ్డుపడుతూ, ఆంధ్ర స్వభావాన్ని అణువణువూ ప్రదర్శించుకుంటున్న ఆంధ్ర బాబును తెలుగుదేశం నాయకులు వీడవలసే ఉన్నది. రాజకీయ పునరేకీకరణతో బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావలసే ఉన్నది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *