Mission Telangana

రెండు విజయాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాళ రెండు విజయాలను సాధించింది. పట్టుదల, కార్యదీక్ష, సమస్యలపై పూర్తి అవగాహన వల్లనే అది సాధ్యమయింది. విద్యుత్ రంగంలో పేచీకోరు ఆంధ్ర ప్రభుత్వం రేపిన పీపీఏల రద్దు విషయంలో, మరోవేపు అనాదిగా సాగుతున్న దురన్యాయం డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వాదన నెగ్గింది. ఈ రెండు అంశాల్లోనూ ఒకవేళ తెలంగాణ ఏర్పడి ఉండకపోతే, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఉండకపోతే ఆంధ్రకు ప్రయోజనాలు కలిగించే వాదనలు నెగ్గేవి. ఎందుకంటే విద్యుత్, నీటి రంగాల అంశాలన్నింటినీ ఆంధ్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, కార్యాచరణ వారికి అనుకూలంగా ఉండడం, మనం అన్యాయానికి గురికావడం కద్దు. దానికితోడు నీటి పారుదల వ్యవస్థ మొత్తం కష్ణా డెల్టా ప్రాంతపు ప్రయోజనాలు మాత్రమే తీర్చిదిద్దాలన్నట్టు, అది జరగకపోతే అన్నపూర్ణ ఎండిపోయి దేశమంతా ఆకలి చావులు సంభవిస్తాయన్నట్టు కాకిగోల చేయడానికి, తిమ్మిని బమ్మి చేయడానికి సీమాంధ్ర మీడియా సదా వారి సేవలో తయారుగా ఉంటుంది.

ఈ కాకి గోలలో వాస్తవాలు తెలుసుకొని, అసలు సమస్య స్వభావాన్ని అర్థం చేసుకొని, తెలంగాణకు రావాల్సిన హక్కు ఏమిటి? దాని కోసం నిలబడడమెట్లా? సాధించుకోవడం ఎట్లా? ఏ వాదనలు ఎట్లా చేయాలి అన్న పూర్తి అవగాహన ఉంటే తప్ప తెలంగాణకు విజయం సిద్ధించదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటిపారుదల వ్యవస్థల మీద పూర్తి పట్టు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆల్మట్టి తెలంగాణకు అన్యాయమేమీ కాదు. మాకు అన్యాయం జరుగుతున్నది మాకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంలోనే ఉన్నదని ఒక అద్భుత ప్రసంగం చేశారాయన. అప్పుడు శాసనసభ స్పెల్‌బౌండ్. అంటే నీటి పారుదల వ్యవస్థల తీరుతెన్నులపై అంతపట్టు ఉన్నది కనుకనే, అదొక్కటే కాకుండా విద్యుత్‌రంగం, మిగతా అన్ని అంశాలపై పాఠాలు చెప్పగలిగిన స్థాయి ఉన్నది కనుకనే ఈ రెండు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి విజయం లభించింది.

తెలంగాణలో విద్యుత్ అవసరాలు, వినియోగం ఎక్కువ ఉన్న దృష్ట్యా, వ్యవసాయం ప్రధానంగా బోరుబావులు, కరెంటు మోటార్ల వ్యవసాయం అయినందువల్ల ఏపీ పునర్విభజన చట్టం-2014లో చాలా స్పష్టంగా విద్యుత్ వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు విద్యుత్ పంపిణీ చేశారు. మిగతా పంపకాలు అన్నింటికీ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కేవలం విద్యుత్‌కు మాత్రం ఈ ప్రాతిపదికన తీసుకొని తెలంగాణకు 53.89 శాతం ఆంధ్రకు 46.11 శాతంగా కేంద్రం నిర్ణయించింది. ఈ విధానంపై ముందే అసంతృప్తి ప్రకటించి కుట్రలు చేయడంలో ఆరితేరిన చంద్రబాబు ప్రభుత్వం పీపీఏలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ పట్ల చంద్రబాబుది నరనరానా జీర్ణించుకున్న వ్యతిరేకత. విద్యుత్ పంపిణీలో ఎక్కడి విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి అక్కడే వినియోగించుకునేట్టుగా, పీపీఏల విద్యుత్ మాత్రం శాతం ప్రకారం నిర్ణయించారు. కానీ ఈఆర్సీ అనుమతుల లాంటి సాంకేతిక తప్పుడు ఆధారాల ద్వారా ఆంధ్ర ప్రభుత్వం పీపీఏల రద్దుకు సాహసం చేసింది.

సమస్యను గమనించిన తెలంగాణ ప్రభుత్వం సమస్య పూర్తి సారాన్ని ఆకళింపుచేసుకొని పీపీఏలపై సంతకాలు చేసిన జెన్‌కో నాలుగు డిస్కమ్‌ల అనుమతి లేకుండా పీపీఏల రద్దు ఏకపక్షంగా చెల్లదని వాదించింది. ఈ వివాదం ముదరడంతో సమస్య బెంగళూరులోని సదరన్ రీజియన్ పవర్ కమిటీ ముందుకు వెళ్లింది. అక్కడ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ తరఫున, ప్రభుత్వం వాదనలకు ఎస్సార్పీసీ, అట్లాగే ఇందులో జోక్యం చేసుకున్న కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విని నిర్ణయం ప్రకటించాయి. ఏకపక్షంగా ఆంధ్ర ప్రభుత్వం చేసిన పీపీఏల రద్దు కుదరదని, వారి నిర్ణయం విద్యుత్ చట్టం-2003, ఏపీ పునర్విభజన చట్టం-2014కు విరుద్ధమైనవి, అందువల్ల మళ్లా నిర్ణయం తీసుకునేవరకు జూన్-2కు ముందు ఉన్న యథాతథస్థితి కొనసాగుతుందని ఆదేశిచింది. ఇది నిశ్చయంగా తెలంగాణ ప్రభుత్వ విజయం.

వర్షాలు ఆలస్యమై రిజర్వాయర్లలో నీళ్లు లేవు. కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్రాలను రిజర్వాయర్లలో నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలని తాగునీటి అవసరాలు మాత్రమే చూడాలని హెచ్చరించి ఉన్నది. శ్రీశైలంలో ఇప్పటికే కనీస నీటి మట్టం 834కు చేరుకున్నది. మరోవేపు నాగార్జునసాగర్‌లో కనిష్ఠస్థాయి 510 అడుగులు కాగా, 517 అడుగులు అంటే కేవలం 17 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. 510 అడుగుల స్థాయిలో ఒక్క చుక్కా వదలకూడదని కోర్టు ఆదేశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతుల్లోనే మంచినీటి అవసరాల పేరిట, ఆంధ్ర ప్రభుత్వం పది టీఎంసీల నీరు విడుదల చేయాలని నీటి విడుదలపైన గవర్నర్ వేసిన అధికారుల కమిటీకి విజ్ఞప్తి చేసింది. నాగార్జునసాగర్ డ్యామ్ సర్కిల్ నిర్వహణ తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నందువల్ల తాగునీటికి పది టీఎంసీలు అవసరం లేదని, 2 టీఎంసీలు మాత్రమే చాలునని వాస్తవస్థితిపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది. దీంతో కేంద్ర జలసంఘం జోక్యం చేసుకుని వాస్తవ స్థితిగతుల ఆధారంగా నాలుగు టీఎంసీల నీరు మాత్రమే విడుదల చేయాలని ఆదేశించింది. అది కూడా సాగునీటి అవసరాలకు కాకుండా కేవలం తాగునీటికే అని స్పష్టం చేసింది. ఇది కీలక విజయం.

తాగునీరు పేర ఇన్నాళ్లూ ఆంధ్రులు ఆడిన నాటకానికి ఇప్పుడు తెరపడింది. అయినా విడుదల చేస్తున్న నాలుగు టీఎంసీల నీరు కూడా తాగునీటి అవసరాలకే వాడుకునేలా చూసే బాధ్యత కూడా కేంద్ర జల వనరుల శాఖ తీసుకోవాల్సి ఉన్నది. తెలంగాణ రాకుంటే.. కేసీఆర్ ప్రభుత్వం కాకుంటే ఇది సాధ్యమయ్యేదేనా? అందువల్ల ఈ రెండు విజయాలు తెలంగాణ ప్రభుత్వానివే…

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *