ఆవిష్కరణలు అంటే కేరాఫ్ తెలంగాణ అనేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే వెబ్ ప్రపంచంలో విస్తరిస్తున్న వెబ్ 3.0 పై దృష్టి పెట్టింది. ఈ టెక్నాలజీ ఆధారంగా ఎన్నో ప్రయోగాలు, కొత్త ఆప్లికేషన్లు, స్టార్టప్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది మరి. ఇప్పటికే బ్లాక్‌చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎన్‌ఎఫ్‌టీ, మెటావర్స్, సీమాటిక్ వెబ్ వంటివి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఫ్రేమ్‌వర్క్‌కు రూపకల్పన చేసింది. నిజానికి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల కోసం ప్రత్యేకంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ఏర్పాటు చేసి, ప్రతీ టెక్నాలజీకి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వాటిని ఉపయోగించేలా రాష్ట్ర ఐటీ శాఖ ప్రాజెక్టులు చేపడుతున్నది. తాజాగా వెబ్ 3.0 టెక్నాలజీకి అత్యధిక ప్రాధానత్యనిస్తున్నది.
వెబ్ 3.0 టెక్నాలజీకి సంబంధించిన అతిపెద్ద వెబ్ 3, ఎథెరియం హ్యాకథాన్ ఇటీవల బెంగళూరులో జరిగింది. 30 దేశాల నుంచి సుమారు 2వేలకుపైగా టెక్నాలజీ నిపుణులు పాల్గొని 459 ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న వెబ్ 3.0 టెక్నాలజీకి ప్రభుత్వ పరంగా చట్టపరమైన సమ్మతి, భద్రత, ప్రామాణీకరణ లేదు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ఐటీ శాఖ.. వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ పేరుతో ఫ్రేమ్‌వర్క్‌కు రూపకల్పన చేసింది. దాన్ని హ్యాకథాన్‌లోనే ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించారు. దీన్ని అక్కడి నిపుణులు ఎంతో ప్రశంసించడం గమనార్హం.
ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో :
తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లోని యాక్సిలరేటర్‌లు, మీటప్ ఈవెంట్‌లు, హ్యాకథాన్‌లతో వెబ్ 3.0 టెక్నాలజీ అనుసంధానమవుతుంది. అదేవిధంగా వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ పెట్టుబడిదారులకు సులభమైన మార్కెట్ యాక్సెస్ కలుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అంటున్నారు. కాగా, కొన్ని జాతీయ నియంత్రణ సంస్థలు కూడా ఈ రెగ్యులేటరీ శాండ్ బాక్స్‌తో చేతులు కలపడానికి ముందుకు రావడం విశేషం. ఇది స్టార్టప్‌లకు, డొమైన్ నిపుణులకు అదనపు స్థాయి హామీనిస్తుంది.