mt_logo

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

By: డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

పార్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురందరేశ్వరి, ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ మధ్యలో భార్య లక్ష్మీపార్వతి సవాళ్లు ప్రతిసవాళ్లు వారంరోజుల నుంచి నడుస్తున్నాయి. తెలుగుజాతి పేర ‘దక్షిణాది నుంచి ఢిల్లీ పీఠానికి సవాల్ విసిరిన మహోన్నత వ్యక్తి, కీర్తితేజం ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు ఆవరణలో ఆవిష్కరించడానికి ఇప్పటికే ఆలస్యమైంద’ని ఒకరు, ప్రతిపాదన పంపిందే మా చంద్రబాబు అని మరొకరి వాదన. కొంతమంది గాడిదల పళ్లు తోముతుంటే, మరికొందరు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారనీ.. ఇట్లా టీడీపీ, ఒకప్పటి టీడీపీ, కాంగ్రెస్‌తో ఉన్న టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న టీడీపీ పరస్పర వాదనలకు దిగుతున్నాయి.

రెండున్నర జిల్లాల కోస్తా నుంచి ఎదిగిన సామాజిక వర్గాలే దన్నుగా నిలిచిన ఎన్టీఆర్ వైతాళికుడైతే, మొదటి తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి మద్రాసులో1952 అక్టోబర్ 18న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న 59వ రోజున అమరుడైన పొట్టి శ్రీరాములును ఎవరు పట్టించుకున్నారు? స్వతంత్ర హైదరాబాద్ స్టేట్‌కు, ఆంధ్ర స్టేట్‌కు సంబంధం లేకపోయినా, నేతల కుత్సితాలకు బలైన పొట్టిశ్రీరాములును ప్రత్యేక రాష్ట్ర అమరుడిగా కాక 60ఏళ్ల తర్వాత కూడా సమైక్యవాద ఐకాన్‌గా చూపెట్టే కుట్ర ఎన్టీఆర్ తెలుగుజాతి ఐక్యత సాక్షిగా బలపడింది. బలిపీ పొట్టిశ్రీరాములు, దీక్ష సమయంలో రాజకీయం నడిపిన ఎన్జీ రంగాల పేర్లు రెండు విశ్వవిద్యాలయాలకు ఫిక్స్ అయిపోయాయి. తెలుగుజాతి ఒక్కటిగా ఢిల్లీ పీఠాన్ని నిలదీయాలని తెలంగాణ అస్తిత్వాన్ని బలిపీ ఎన్టీఆర్‌పేరు విమానాశ్రయాలు, పార్కులు, విద్యాలయాలకు ఫిక్స్ అయింది. కానీ అనేకమంది తెలంగాణ వైతాళికుల పేర్లే చరిత్రకు ఎక్కలేదు. విగ్రహాలు అసలే ఆవిష్కరించబడలేదు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌లో ఏ కూడలికి తెలంగాణ వైతాళికుడి పేరు లేదేమిటని తెలుగు బాలయ్యలు ప్రశ్నించినట్టుగానే తెలంగాణ బాలయ్యలు అడగాల్సిన ప్రశ్న!

ఓ సినిమాలో జగన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఈ విగ్రహాల ప్రతిష్టాపన ఊరూరుకు కొనసాగించి కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెడుతున్నావ్? నాయకుడంటే ప్రజల గుండెల్లో ఉండాలి. రాతి విగ్రహాల్లో కాదు’ అని ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం ఎందుకింత రాజకీయం చేస్తున్నారు?

ఓదార్పు పేరుతో దారితప్పిన తన రాజకీయ జీవిత గమ్యాన్ని సరిచేసుకోవడానికి ఊరూరా రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించే జగన్‌కు ఆయన పార్టీకి తెలంగాణ కోసం అసువులు బాసిన వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించే ఔదార్యం ఉండదు. తెలుగు ప్రజల తీర్పే శిరోదార్యమనే తెలుగు దేశానికి, వైఎస్సార్‌సీపీకి తెలంగాణ జాతి మట్టిలో పుట్టిన జ్ఞాన కణికలు, చకిముకిరాళ్ళు, అగ్గిపూలకు శిరస్సు వంచి నమస్సుమాంజలులు ఘటించే తీరిక దొరకదు.

మా నాయన విగ్రహావిష్కరణను రాజకీయం చేస్తారా అన్న బాలయ్యకు, జగన్‌కు వాళ్ళ తండ్రి భౌతికకాయం దగ్గరే రాజకీయం నడిపి అధికారం కోసం పావులు కదిపిన ఘనమైన చరిత్ర ఉందని ప్రజలు మరచిపోయారనుకుంటారు.

మా వంశమే చరిత్రను తిరుగరాయగలదని, మా వంశవృక్షం వంచి సారించిన వింటినారి బాణాలమనే అహంభావం-అభిజాత్యం- మేమే తెలుగుజాతి మణిపూసలమనే పేటెంట్- ఇంత రణగొణ ధ్వని మధ్య పాపం సాధుజీవి, గాంధీని నమ్ముకొని జీవితమంతా విషాదాన్ని నింపుకుని ఆంధ్రా, నయవంచక నాయకుల కుట్రలకు బలియిన పొట్టి శ్రీరాములు 60వ వర్ధంతి ఏ చప్పుడు లేకుండాపోయింది. తెలంగాణ ఉద్యమం రోడ్డెక్కగానే మళ్లీ కృత్రిమ సమైక్యవాదులు పొట్టి శ్రీరాములు బొమ్మ ముందరపెడతారు!

కాంగ్రెస్ టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఇతర సీమాంధ్ర లాబీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర ప్రాంత రాష్ట్రం కోసం పోరాడిన చరిత్రనే ధ్వంసిస్తారు? ఆ అమరుడు తెలంగాణ జాతికి కూడా తమ ఆశయసాధనలో స్ఫూర్తిదాత అని చెప్పాల్సిన సమయం ఇది. ట్యాంక్‌బండ్ మీద తెలంగాణ వైతాళికుల విగ్రహాలు లేవని తెలంగాణ యువత ఉద్యమించినప్పుడు, ‘మిలియన్ మార్చ్’ గా సీమాంధ్ర నమూనా ఆధిపత్య విగ్రహాలను ధ్వంసం చేసి ఆగ్రహం వ్యక్తపరిచినప్పుడు రాజశేఖర్‌రెడ్డి కొడుకుకు, ఎన్టీ రామారావు కొడుకుకు ఇది తెలంగాణ ధర్మాగ్రహం అని ఎందుకు అనిపించలేదు?

పార్లమెంటులో ఎవరి విగ్రహాలు పెట్టాలి? ఎవరు చొరవ చూపించాలి? ఇంత వరకు ఎవవరికి ఈ గౌరవం దక్కింది? మొదలగు అంశాల్లోకి వెళ్ళితే అనేక విషయాలు చర్చకు వస్తాయి.పార్లమెంటు ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తైలవర్ణ చిత్రపట ఆవిష్కరణ కోసం ఎంతో ప్రయత్నిస్తే గానీ సాధ్యపడలేదు. మన అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని ఉద్యమిస్తే ‘అందులో రాజకీయ ప్రయోజనాలను’ఎత్తిచూపి పలుచనైపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేకపోయిందో వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు.

ఎన్టీఆర్ విగ్రహం కోసం మేమంటే మేమే కృషి చేశామని జబ్బలు చరుస్తున్న నాయకుల్ని, వారి చంకలో చేరి నిరంతరం తెలంగాణ ఉద్యమ నాయకుల మీద అవాకులు చెవాకులు పేల్చే తెలుగుదేశం నాయకుల గుంపు ఎందుకు మా తెలంగాణ వైతాళికుల విగ్రహాల కోసం ముందలపడి కొట్లాడరని ప్రశ్నించదు. ప్రపంచ తెలుగు మహాసభల పేర తిరుపతిలో సమైక్యవాదాన్ని, ఆధిపత్య సంస్కృతిని చాటుకోవడానికి, నిలుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం హంగామా! ఇదంతా ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు అసువులు అర్పించిన డిసెంబర్ మాసంలోనే ఊపందుకోవడం యాధృచ్ఛికమైనా-తెలంగాణ జాతి మేల్కొల్పడానికి సందర్భానుసారమేనేమో!

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *