mt_logo

సకల జనుల సమ్మెపై సీమాంధ్రుల కుట్ర బట్టబయలు

సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్నప్పుడు ఆ సమ్మెను విఫలం చేయడానికి సీమాంధ్ర ప్రభుత్వం చేయని కుట్ర లేదు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణది. ఆర్టీసీలో మెజారిటీ కార్మిక సంఘం అయిన నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్.ఎం.యు)  నేతలు మహమూద్, నాగేశ్వర రావు అనే సీమాంధ్రుల సాయంతో ఈ కుట్రకు తెరలేచింది. సమ్మె మొదలైన నెల రోజుల తరువాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులను ఒప్పించి కొన్ని బస్సులు నడిపించడం మొదలుపెట్టారు ఈ ఇద్దరు ట్రేడ్ యూనియన్ నాయకులు.

అప్పట్లోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఈ ఇద్దరు నాయకుల చర్యలను తీవ్రంగా నిరసించారు. అయినా మహమూద్. నాగేశ్వర రావులు మాత్రం తమకేమీ తెలియదని, తాము కూడా తెలంగాణకు అనుకూలమేనని బొంకారు. వీరి మాటలని విశ్వసించని తెలంగాణ ప్రాంత ఆర్టీసీ యూనియన్ నాయకులు నేషనల్ మజ్దూర్ యూనియన్ నుండి బయటికి వచ్చి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టి.ఎం.యు) అనే కొత్త సంఘం స్థాపించుకున్నారు.

మహమూద్, నాగేశ్వర రావులు తెలంగాణ పట్ల చేసిన ద్రోహం తెలుసుకున్న మన ఆర్టీసీ కార్మికులు మెల్లగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ను ఆదరించడం మొదలుపెట్టారు.

ఇప్పుడు తాజాగా ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మహమూద్, నాగేశ్వర రావులు ఇద్దరూ మళ్ళీ ఎన్.ఎం.యూ తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ ప్రచారం మొదలు పెట్టారు. కానీ సీమాంధ్ర ప్రాంతంలో బాజాప్తాగా తెలంగాణకు వ్యతిరేకంగా తాము ఎట్లా కుట్ర చేసింది వెల్లడించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

“సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసింది” తామేనని సిగ్గులేకుండా కృష్ణా జిల్లా ఆర్టీసీ డీపోల్లో బ్యానర్లు కట్టుకున్నారు ఎన్.ఎం.యు సభ్యులు.

డ్యూటీ మీద ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిన తెలంగాణ డ్రైవర్లు, కండక్టర్లు ఎన్.ఎం.యు చేసిన ఈ మోసాన్ని బట్టబయలు చేశారు. సీమాంధ్ర నాయకత్వంలోని సంఘాల్లో పనిచేయడం ఎంత ప్రమాదకరమో ఆర్టీసీ కార్మికులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

అందుకే సింగరేణి కార్మికుల్లాగానే ఆర్టీసీ కార్మికులు కూడా రేపటి ఎన్నికల్లో తెలంగాణ కార్మిక సంఘాన్నే గెలిపించడానికి ఉద్యుక్తులవుతున్నారు.

ద్రోహపూరితంగా సమ్మెను విచ్చిన్నం చేయడానికి కుట్ర పన్నిన సీమాంధ్ర నాయకులే సమ్మె విరమణ జరిగినప్పుడు నిస్సిగ్గుగా తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై ఆధారంలేని ఆరోపణలు చేశారు. సకల జనుల సమ్మెను విరమించడంపై కొంతమంది తెలంగాణ మిత్రుల్లో కూడా కొంత అసంతృప్తి లేకపోలేదు. కానీ సమ్మెపై సీమాంధ్ర సర్కారు చేసిన కుట్ర ఇప్పుడు స్పష్టంగా వెల్లడైంది.

తెలంగాణ ప్రజలుగా మనం ఈ ఉదంతం నుండి గుణపాఠం నేర్వాలె. సీమాంధ్రుల నాయకత్వంలోని పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *