mt_logo

తెలంగాణ కొరకు ఒక ముస్లిం యువకుడి ఆత్మహత్యాయత్నం

ఫొటో: తీవ్రంగా గాయపడ్డ షేక్ ఫాజిల్ ను ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం. 

 

రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యంతో నిరాశ చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ ఫాజిల్ ఆత్మహత్యాయత్నం చేశాడు.

“‘రాష్ట్రమైనా ఇవ్వండి.. లేదా ప్రాణమైనా తీసుకోండి.. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెలంగాణవాదులపై పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారు.. ప్రత్యేక రాష్ట్రంతోనే బతుకులు బాగుపడతాయి..’ అని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన షేక్ ఫాజిల్ వ్యక్తం చేసిన ఆవేదన. వృత్తిరీత్యా వడ్రంగి అయిన మోస్రా గ్రామానికి చెందిన షేక్ ఫాజిల్ రాష్ట్ర ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయనను హుటాహుటిన 108లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతోనూ ఫాజిల్ జై తెలంగాణ నినాదాలు చేశాడు.

ఆయన విలేకరుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

తెలంగాణ రాష్ట్రంతోనే ప్రజల బతుకులు బాగుపడుతాయని, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. తెలంగాణ విషయంలో జరుగుతున్న పరిణామాలతోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణవాదులు ఎప్పుడు ఉద్యమించినా పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేస్తూ అరెస్ట్ చేస్తున్నారని వాపోయాడు. తన ప్రాణమైనా తీసుకుని తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున అరిచాడు. కాలిన గాయాల బొబ్బలతో ఉన్నప్పటికీ తెలంగాణ గురించే తన ధ్యాస అని దీనంగా తెలిపాడు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. సీమాంధ్ర వాళ్లతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తెలంగాణ వస్తేనే మా సమస్యలు తొలగిపోతాయని అన్నాడు. వర్ని, మో స్రాలో కూడా సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్లదే ఆధిపత్యం కొనసాగుతుందని, ఎంత కష్టపడిన ఇబ్బందులు తప్పడం లేదని అన్నాడు. టివీలో వస్తున్న వార్తలను చూసి ఇక తెలంగాణ రాదేమోనని మధ్యాహ్నం 3గంటలకు ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశానని తెలిపాడు. మాకు తెలంగాణ ఇస్తారా నా ప్రాణం కావాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

ఆంధ్రవాలోసే కామ్ నహీ మిల్‌రా..

– షేక్ ఫాజిల్ భార్య రైసా

చంద్రబాబు పాదయాత్రలో ఉన్న గూండాలు తెలంగాణవాదులపై దాడులు జరిపారు. ఆంధ్ర వాళ్లకు పోలీసులు సహకరిస్తున్నందున మోస్రా, వర్నిలో పనులు దొరకడం లేదు. తెలంగాణ వస్తేనే మా బతుకులు మారుతాయి, మాకు పని దొరుకుతుందని ఆరునెలల నుంచి నా భర్త నాతో అంటున్నాడు. ఇక్కడ అధికంగా సీమాంధ్ర వాళ్లు ఉండడంతో మాకు పనులు దొరకడం లేదు. ప్రతీరోజు టివీలో రాష్ట్ర ప్రకటన ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాడు. సీమాంధ్ర నాయకులు రాష్ట్రానికి అడ్డుపడుతున్నారని ఆవేదన చెంది ఇంటిలో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఇంటి బయటకు వచ్చాడు. మాకు తెలంగాణ కావాలి సీమాంధ్ర పాలన కాదు అని మాతో అన్నాడు.

అమ్మీ అప్‌నేకో తెలంగాణ చాహీయే బోల్‌తాతా..

– షేక్ ఫాజిల్ తల్లి ఖాద్రీబేగం

నా కొడుకు ఎప్పుడు తెలంగాణ వస్తుందని రోజూ టివీ చూస్తున్నాడు. మోస్రా, వర్ని గ్రామాల్లో అధికంగా సీమాంధ్ర వాళ్లు ఉండడంతో కొడుకుకు పని దొరకడం లేదు. నాకొడుకు టీఆర్‌ఎస్ కార్యకర్తగా ఉంటున్నాడు. అమ్మీ అప్‌నేకో తెలంగాణ చాహీయే అప్పుడే మన బతుకులు మారుతాయి అని అనేవాడు. కానీ రాష్ట్రం రాదేమోనన్న భయంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదాలు చేశాడు.

అనంతరం జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం షేక్ ఫాజిల్‌ను 108లో తీసుకురావడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్ రాకేశ్ ఆయన్ను పరిశీలించి 35 నుంచి 40 శాతం వరకు శరీరం కాలిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రస్తుతం షేక్ ఫాజిల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *