మహారాష్ట్ర గవర్నర్ గా నియమించబడ్డ తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన సీహెచ్ విద్యాసాగర్ రావుకు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రప్రభుత్వం తరపున పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుందని, తనకు జరిగిన ఈ సన్మానాన్ని జీవితంలో మర్చిపోలేనని, ఇది తనకు ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందేలా చూస్తానని, గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి గ్రామానికి అందాలని ఆయన చెప్పారు.
గోదావరి నీటిలో రాష్ట్రానికి దక్కాల్సిన సుమారు 720 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నదని, లక్షల డాలర్లతో కూడా ఈ నీటిని వెలకట్టలేమని విద్యాసాగర్ రావు అన్నారు. పార్టీలన్నీ ఈర్ష్యాద్వేషాలకు తావులేకుండా కలిసి పనిచేయాలని, రాజకీయ పార్టీలన్నీ సమిష్టిగా పనిచేస్తే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర గవర్నర్ గా ఆయనను సన్మానించుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని, విద్యాసాగర్ రావుతో తనకు మూడు దశాబ్దాల పరిచయం ఉందని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారని, బీజేపీని ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పించిన ఆయన కృషి మర్చిపోలేనిదని సీఎం ప్రశంసించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాజేశ్వర్ రావు, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.