త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, తామే అధికారంలోకి వస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మేనిఫెస్టో ను కాపీ కొట్టిందని, దూరదృష్టి లేని కాంగ్రెస్ ప్రజల్లో నవ్వులపాలు కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పావలా ప్రజలకు, ముప్పావలా జేబులకు పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం చేశాడని, ఇప్పటికైనా పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని కేసీఆర్ మండిపడ్డారు.
పొన్నాల లాంటి నేతలకు స్వతంత్రంగా ఆలోచించే పరిజ్ఞానం లేదని, బడుగు, బలహీన వర్గాలకు 55శాతం, బీసీలకు 30 శాతం టిక్కెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కనివారు బాధ పెట్టుకోవద్దని, అధికారంలోకి వచ్చినతర్వాత ఎమ్మెల్సీ స్థానాలిచ్చి గౌరవిస్తామని అన్నారు. పార్టీకి సేవ చేసినవారికే టిక్కెట్లు ఇచ్చామని, ఉద్యమంలో పని చేసి టికెట్ రాని వారిపై సానుభూతి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ త్రీడీ టెక్నాలజీ పద్దతి ఉపయోగిస్తుందని, హాలోగ్రాం విధానం ద్వారా కేసీఆర్ సభలు 700 ఉంటాయని, ఒక్క హైదరాబాద్ లోనే 200 ఉంటాయని కేసీఆర్ చెప్పారు. 13న కరీంనగర్, 14న నల్గొండ, 15న నిజామాబాద్ జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.