తెలంగాణలో త్వరలో రాబోయేది టీఆర్ఎస్ ప్రభంజనమే అని నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఖైరతాబాద్ కు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ, వెంకయ్యనాయుడు ఒత్తిడి వల్లే బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు.
టీఆర్ఎస్ సుడిగాలిలో మిగతా అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని ఆమె అన్నారు. పార్టీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మైనార్టీల కోసం పాటుపడుతుందని, తాము అధికారంలోకి రాగానే వక్ఫ్ బోర్డుకు అన్ని అధికారాలు కల్పిస్తామని చెప్పారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ లో ఏ విధమైన అభివృద్ధి చేశారో ప్రజలు చూసారని కవిత అన్నారు.