mt_logo

నార్కోటిక్స్ డ్రగ్స్ రూపుమాపడానికి ప్రత్యేక సాంకేతికతను వాడండి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా తొలగించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు ప్రత్యేక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం వెల్లడించారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో “కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్” ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతం గా పనిచేస్తున్నాయని,అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తివంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సెలరేషన్, ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయం లో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సదస్సులో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *